విధి వాక్యంవల్ల గ్రహించిన అర్థానికి పూరకమే అర్థవాదం. అర్థమంటే ధర్మ మోక్షాలనే పురుషార్థాలు. వాటిని విధి వాక్యాలు బోధిస్తుంటే అది శ్రోతల చిత్తానికి బాగా హత్తుకోటాని కుపోద్బలకంగా చెప్పే వాక్యాలీ అర్థవాదాలు. అయితే విధి వాక్యం సూటిగా అర్థాన్ని బోధిస్తే ఇవి దానిమీదా దీనిమీదా నెపం పెట్టి బోధిస్తాయి. కనుక అర్థవాదాలన్నీ కల్పనాకథలు. కల్పనలైనా ఇవి శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాన్నే ఏదో ఒక విధంగా వర్ణిస్తున్నాయి. కాబట్టి ఆ దృష్ట్యా మనకుపాదేయమే. వాటి పాటికవి అసత్యమైనా అవి బోధించే పురుషార్థాన్ని బట్టి చూస్తే సత్యమే. విధాన మసత్యమూ, విషయం సత్యమూ. సత్యాని కసత్యమే ఆలంబనమని పెద్దల మాట. అసత్యే వర్త్మని స్థిత్వా తత స్సత్యమ్ ప్రసాధయేత్. అసత్యమైన మార్గంలోనే సత్యాన్ని అందుకోవాలి మానవుడు. అప్పుడసత్యమైనా అది మనకు హేయం కాదు. ఉపాదేయమే. దీనిని బట్టి అర్ధవాదాలకూ విధులకూ ఏకవాక్యత సిద్ధిస్తున్నది. అంతేగాక వాటికివి అంగంగా కూడా పరిణమిస్తున్నాయి. కనుకనే ఇతిహాస పురాణాలు వేదాని కంగభూతమని వర్ణించటం.
పోతే ఈ అర్థవాదమనేది నాలుగు విధాలుగా నడుస్తుంది. ఒకటి స్తుతి. మరొకటి నింద. ఇంకొకటి పురాకల్పం. వేరొకటి పరకృతి. ఒక విషయం చెప్పి దాన్ని తప్పకుండా ఆచరించమని చెప్పటానికా విషయాన్ని ప్రశంసించాలి. తద్విరుద్ధమైన పని చేయకుండా అలాంటి వ్యవహారాన్ని దూషించాలి. అది మేము క్రొత్తగా చెప్పటం కాదు. ఎప్పటినుంచో వస్తూ ఉన్న సందర్భమే నని పురావృత్తాన్ని ఉదాహరించాలి. అది కూడా నీవూ నేనూ కాదు మహనీయులెందరో చేసి సత్ఫలితాన్ని పొందారని పరులకృతిగా దాన్ని వర్ణించి చెప్పాలి ఇంత పకడ్బందీగా వర్ణించేసరికి ఎంత వాడికి కూడా శాస్త్రచోదితమైన అర్థాన్ని తప్పకుండా అనుష్ఠించాలనే ఒక ప్రరోచన Inclination కలుగుతుంది. ఇలాటి ప్రరోచన మామూలుగా చెబితే కలగదు. అది శుష్కమైన మాట. ఇది అలా కాదు. అర్థవాదంతో కూడింది. కాబట్టి సరసంగా మారి శ్రోతకు ప్రరోచకమవుతుంది. ప్రరోచనే గాక అలా వర్ణించటం మూలాన ప్రతి పత్తి సౌకర్యం కూడా ఉందన్నారు భగవత్పాదులు. ప్రతిపత్తి అంటేవిషయ గ్రహణం. అది సులభంగా మనసుకు రావాలి మానవుడికి. శాస్త్రం నేరుగా ఏకరువు పెడితే రాదది. ఈ ప్రణాళికలో అయితే బాగా మనసుకు పడుతుంది. సాధారణంగా మానవులది
Page 26