పోతే ద్విజ బంధువులని కొందరున్నారు. వీరు పురాకృత సుకృతం కొద్దీ ద్విజుల వంశంలో పుట్టి ఉంటారు. కాని ద్విజలక్షణాలకు వేటికీ నోచుకోరు. జాతి మాత్రోపజీవులు వీరు. అంటే ఫలానా వారు మా బంధువులని చెప్పుకోటమే తప్ప వారిలాగా విద్యా వినయాది సంపత్తి లేశమాత్రం కూడా ఆర్జించని వారు. ద్విజ బంధువులంటే ఇలాంటి వారే. వీరికీ అర్హత లేదు శాస్త్రాధ్యయనానికి. ఇలాంటి వారందరికీ పనికి వస్తుందనే మహర్షులీ ఇతాహాస పురాణాలు రచించారు. అలా తగ్గు స్థాయికి దిగి వచ్చి చేసిన రచనలు కాబట్టి అవి ఎలాంటివారికి బోధించినా ఎంతో చక్కగా అవగాహన చేసుకోగలరు. వీటి సహాయం లేకుండా అసలైన శాస్త్రార్థాన్ని సూటిగా బోధించినా మనసుకు పట్టటం కష్టసాధ్యమే. కనుకనే 'ఇతిహాస పురాణాభ్యామ్ వేదాన్ సముప బృంహయేత్త'న్నారు పెద్దలు. ఇతిహాస పురాణాల తోడ్పాటుతోనే నాలుగు వేదాలనూ బలపరిచి బాగా గట్టి చేసుకోవాలట. అవి లేకపోతే వాటికి పరిపూర్ణత లేదు.
అసలు వేదంలోనే పురాణేతి హాసాల ప్రస్తావన వస్తుంది. మంత్ర బ్రాహ్మణాత్మకం గదా వేదమంటే. అందులో మంత్రమొక అలౌకికమైన విషయాన్ని మనకు బోధిస్తే బ్రాహ్మణం దాని భావాన్ని వివరించి అది అనుష్ఠించే విధానాన్ని మనకు బోధిస్తుంది. ఒక విధంగా మంత్ర వ్యాఖ్యాన రూపాలు బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలనేవి అష్టవిధాలన్నారు సాంప్రదాయికులు. వాటిలో ఇతిహాసం పురాణమనేవి కూడా చోటు చేసుకొని ఉన్నాయి. “ఊర్వశీ హాప్సరా” ఇలాటి వాక్యాలు ఇతిహాసాలైతే “సదేవ సోమ్యేద” మిత్యాది వచనాలు పురాణాల క్రిందికి వస్తాయన్నారు భాష్యకారులు. కర్మచ్ఛిద్రాలని కొన్ని ఉన్నాయి. ద్వాదశ వార్షికాలని శతవార్షికాలని దీర్ఘకాలిక యాగాలు చేసేటపుడు మధ్య మధ్య విరామాలు కొన్ని ఏర్పడుతుంటాయి. వీటికి కర్మచ్ఛిద్రాలని పేరు. ఆ సమయంలో ఋత్విక్కులు యజమానుడికి కొన్ని కథలూ, గాథలూ చెబుతుంటారు. అవి ఏవో ఉబుసుపోకకు చెప్పే కథలు గావు. ఆ యాగానుష్ఠానానికి అనుకూలమైనవీ దానికి పనికి వచ్చేవే. పారిప్లవాలని కూడా వీటికొక నామధేయముంది.
ఇలాంటి సందర్భాలకు శాస్త్రంలో అర్ధవాదమని పేరు. మన పురాణాలూ, ఇతిహాసాలూ, అన్నీ ఇలాంటి అర్థవాదాలే. విధిశేషోర్థవాదః అన్నారు జైమినుల వారు.
Page 25