భావించి పరవశుడవుతాడు. అందలి పాత్రలు తానేనని వారి సుఖదుఃఖాలు తనవేనని తాదాత్మ్యం Identity చెందుతాడు. ఈ మనస్తత్వం మానవులకుండటం బాగా కనిపెట్టే క్రాంతదర్శులైన మన మహర్షులు వారి స్థాయికి తగినట్టుగా ఈ పురాణేతి హాసరచన చేయవలసి వచ్చింది.
శాస్త్రాలు కేవలమొక ఉత్తమాధికారులకే గాని మిగతా జనబాహుళ్యానికి కొఱుకుడు పడవు. ఇవి అలా కాక మన జీవితానికింకా సన్నిహితం కాబట్టి పదిమంది మనసునూ ఆకర్షిస్తాయి. ముఖ్యంగా స్త్రీలూ శూద్రులూ ద్విజబంధువులూ ఈ మూడు వర్గాల వారికీ ప్రభు సమ్మితమైన శాస్త్రం అందని మ్రాని పండు. స్వతహాగా అర్థం చేసుకోలేరు. ఒకరు చెప్పినా బోధ పడదు. అదేమిటి. వారూ మనలాంటి మానవులే గదా మనకున్న హక్కు వారికి లేదా - వారిని మనం చిన్న చూపు చూడటం దేనికని ఆక్షేపించరాదు. గ్రహణశక్తికీ మానవత్వానికీ సంబంధం లేదు. ఎంత గుణవంతుడైనా ఒక విషయాన్ని గ్రహించలేకపోవచ్చు. పనికి రానివాడైనా గ్రహించవచ్చు. సాధారణంగా స్త్రీలు గృహమాత్ర ప్రజ్ఞలు. బయట నలుగురి మధ్యా తిరిగి నాలుగు విషయాలు గ్రహించే అవకాశం వారికి తక్కువ. విశేషించి పూర్వ కాలంలో అసలే లేదని చెప్పవచ్చు. దీనికి తోడు పిల్లలను కనటం పెంచటం ఇల్లూ వాకిలీ చక్కబెట్టుకోటం - అతిథి అభ్యాగతులకు చేసి పెట్టటం - వీటితోనే జీవితమంతా గడచిపోయేది. అలాంటప్పుడొక ఉపనయనమనీ లేదా అధ్యయనమనీ, సంస్కారమనీ ఇలాటి కలాపాని కవకాశమెక్కడిది.
ఇలాగే శూద్రులు కూడా. శూద్రుడంటే చదువు సంస్కారం లేని మానవుడని అర్థం. జన్మతః ప్రతివాడూ శూద్రుడే. జన్మనా జాయతే శూద్రః అన్నారు. సంస్కారం పొందిన తరువాతనే ద్విజుడనిపించుకొంటాడు. ద్విజ అంటే రెండు జన్మలెత్తిన వాడని శబ్దార్థం. రెండు జన్మలేమిటి. ఒకటి భౌతిక జన్మ. మరొకటి జ్ఞాన జన్మ. ఈ రెండవ జన్మ లేనంతవరకూ వాడికి ఏకజాతి అని పేరు. అంటే ఒకే జన్మగలవాడు. పుట్టినట్టే బ్రతుకుతున్నాడని భావం. అలా బ్రతుకు సాగిస్తూ ఉన్నంతవరకూ వాడు శూద్రుడే. శూద్రుడయినంత వరకూ వాడికి శాస్త్రం చదివి బోధపరుచుకొనే సామర్థ్యముండబోదు.
Page 24