ఉంది. కనుకనే శాస్త్రాన్ని ప్రభు సమ్మితమని వర్ణిస్తారు. అయితే సూటిగా ఘాటుగా విషయాన్ని బోధించటం వల్ల ఆబాల గోపాలమందరూ దాని విషయంలో సుముఖత చూపరు. గణిత శాస్త్రంలో మాదిరి ఏకొంద రుత్తమాధికారులో దానిలో కూడా సారస్యం చూడగలిగిన వారుండవచ్చు. మిగతా మంద మధ్య మాధికారులంతా దానికి చాలావరకు విముఖులే. పూర్తిగా విముఖులైతే శాస్త్రానికి సార్వజనీనత లోపిస్తుంది. అది మొదలు చెడ్డబేరం. అంచేత సర్వులకూ దానియెడల సౌముఖ్యం కలగాలంటే అంతకన్నా సుకుమారమైన మార్గాన్ని అవలంబించాలి. ఏతాదృశ మార్గావలంబన ఫలమే పురాణేతి హాసాల ఆవిర్భావం. శ్రుతిస్మృతి రూపమైన శాస్త్రం ప్రభు సమ్మితమైతే ఇవి రెండూ మిత్ర సమ్మితం. మిత్రుడు ప్రభువు మాదిరి శాసించడు-మనలను దండించడు. అతడికా అధికారం లేదు. అయినా మన మేలు కోరేవాడు కాబట్టి శాసించక పోయినా దగ్గర జేరి సలహా ఇస్తాడు. ఇది నీకు మంచిది-ఇంతకు పూర్వం ఫలానా వాడిలా నడచుకొని బాగుపడ్డాడు-ఇదుగో ఇది నీకే మాత్రమూ మంచిది గాదు. ఈ మార్గంలో నడచి పూర్వం ఫలానా వాడు చెడిపోయాడని దృష్టాంత పూర్వకంగా హితా హితాల నుపదేశిస్తాడు. శాస్త్రమనేది ఇలా దృష్టాంతం చెప్పదు. అది ప్రతిపాద్యమయిన అర్ధాన్ని నగ్నంగా బయట పెడుతుంది. అది కేవలం సిద్ధాంతం. దృష్టాంతం చూపనంత వరకు ఎంత సిద్ధాంతం ఏ కరువు పెట్టినా అది మన బుద్ధులకు పరోక్షం. దృష్టాంత బలంతోనే పరోక్షంగా వర్తించే విషయమెప్పుడూ మానవుడి మనోనేత్రానికి ప్రత్యక్ష రూపంగా భాసిస్తుందంటారు భగవత్పాదులు.
పురాణాలూ ఇతిహాసాలూ ఇలా ఒక మిత్రుడి లాగా మనకు ఆయా సత్యాలను దృష్టాంతరూపంగా ఆవిష్కరిస్తూ పోతాయి. ఈ దృష్టాంతాలకే ఆఖ్యానాలనీ, ఆఖ్యాయికలనీ, కథలనీ అనేక నామధేయాలు. కథారూపంగా ఏది చెప్పినా అది శ్రోతల మనసును ఆకర్షిస్తుంది. కారణ మేమంటే మానవుడి జీవితమే ఒక కథ. భౌతిక జగత్తులో జీవితమైతే వాఙ్మయ జగత్తులో అది కథ. ఇక్కడ మానవులైతే అక్కడ వారు పాత్రలు. ఇక్కడ వీరనుభవించే సుఖదుఃఖాది ద్వంద్వాలే అక్కడ రస భావాదులుగా చెలామణీ. ఇంత సన్నిహితంగా బింబానికి ప్రతిబింబంలాగా జతపడటం మూలాన్నే కథా రూపంగా ఏది చెప్పినా మానవుడు అది తన జీవితంగానే
Page 23