#


Index


పురాణములు-వాటి విశిష్టత

అది మనోధర్మం కాబట్టి పౌరుషేయమని వేరుగా చెప్పబనిలేదు. శ్రుతి ప్రతిపాదితమైన ధర్మమోక్షాల స్వరూపాన్నే తరువాత స్మృతికారులైన మను యాజ్ఞవల్క్యాదులు తమ మనస్సనే మందరం పెట్టి మథించారు.

  అందులో సూక్ష్మంగా సంగ్రహంగా చెప్పిన ధర్మాలనే మానవుల వర్ణాశ్రమ వయోవస్థాదుల కనుగుణంగా విభజించి వారిదైనందిన జీవితానికి పనికి వచ్చేలాగా సవరించి వ్యాఖ్యానిస్తూ వచ్చారు వారు. వీటికి ధర్మ శాస్త్రమని కూడా నామాంతరం. ఇవి కొన్ని లోక ధర్మాలు - కొన్ని వ్యక్తి ధర్మాలు - కొన్ని గృహస్థ ధర్మాలు - కొన్ని సమాజ ధర్మాలు. ఒకటిగాదు. అసంఖ్యాకంగా ఉన్నాయి. అందులోనూ ఒకటి అభ్యుదయ ఫలమిచ్చే ప్రవృత్తి మార్గమైతే ఇంకొకటి నిశ్రేయస ఫలమిచ్చే నివృత్తి మార్గం. ఈ రెండు ప్రధానమైన ప్రణాళికలలో ప్రవహిస్తూ పోతాయి సకల విధములైన స్మృతి ధర్మాలు. ఎలా ఎంత దూరం ప్రవహించినా అది శ్రుతుల అడుగు జాడలలోనే. కాబట్టి శ్రుతుల మాదిరి స్మృతులు కూడా శాస్త్రమే మన పాలిటికి. ఈ శాస్త్ర ప్రమాణం బోధించే ధర్మమోక్షాలనే రెండు పురుషార్థాలనూ పట్టుకొని తదనుగుణంగా జీవితయాత్ర సాగిస్తూనే తాత్కాలికమైన ప్రేయస్సునే గాక సార్వకాలికమైన శ్రేయస్సును - నిశ్రేయసాన్ని కూడా అందుకోటమే ఎప్పటికైనా మానవజన్మ ఎత్తినందుకు సార్థకం.

  కానీ ఇందులో వచ్చిన తిరకాసేమంటే శాస్త్రం బోధించే విషయం గొప్పదే సందేహం లేదు. కానీ ఆ బోధించే విధానంలో మనకు నాజూకు కంటే కాఠిన్య మెక్కువగా కనిపిస్తుంది. శాస్త్రమనే పేరు పెట్టటంలోనే ఉంది దాని చెహరా. శాసించేదేదో అది గదా శాస్త్రమని పేర్కొన్నాము. శాసనమంటే ఏమిటి. ఒక పనిచేయమని గాని చేయవద్దని గాని విధి నిషేధాలను మానవులకు నిర్దాక్షిణ్యంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పటమే గదా. అలా చెప్పటంలో ఆకర్షణ ఏ మాత్రమూ ఉండబోదు. ఆకర్షణ లేకపోగా వినే వారికది ఉద్వేజకంగా కూడా కనిపిస్తున్నది. దేశమేలే ప్రభువుల శాసనం లాంటిదది. ప్రభువైన వాడికి మొగమాటం లేదు. ప్రజా క్షేమమే వాడి కర్తవ్యం. అది ధర్మపాలనం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిఒక్కడూ తన ధర్మాన్ని పాటించేటట్టు చూడాలంటే అందులో దయా దాక్షిణ్యాలు పెట్టుకొంటే లాభంలేదు. కఠినంగా శాసించి చెప్పవలసిందే. అలాగే శాస్త్రం కూడా ఇది హేయమిది ఉపాదేయమనే జ్ఞానం మనకు శాసన రూపంగానే అందజేయవలసి

Page 22

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు