#


Index


పురాణములు-వాటి విశిష్టత

కూడా సాపేక్షమే కావాలి గాని నిరపేక్షమెలా అవుతుంది. మరి నిరపేక్షమైన శ్రేయః ఫలమే కావాలంటే జీవ జగదభిన్నమైన ఈశ్వరతత్త్వాన్నే పట్టుకోవాలి మనం. అదీ మనకు పరోక్షంగా కాక ఆత్మరూపంగానే Subjective భావించాలి. దానికే బ్రహ్మమని పేరు. అది ఇక పరిపూర్ణమైన అభేద దృష్టి కాబట్టి అపేక్ష అనే భావానికక్కడ తావులేదు. అంటే నిరపేక్షమని అర్థం. నిరపేక్షమైతే తన్నిమిత్తంగా కలిగే శ్రేయస్సుకూడా శాశ్వతం కాక తప్పదు. ఇంతకు మించిన శ్రేయస్సు మరొకటి సృష్టిలోనేలేదు కనుక దీనిని పెద్దలు నిశ్రేయసమని Summum Bonum పేర్కొన్నారు. మరి సమస్తమైన భేద ప్రపంచంనుంచీ వైదొలగటం గనుక దీనికి ముక్తి మోక్షమని కూడా నామాంతర మేర్పడింది.

  మొత్తంమీద అటు ధర్మమూ, ఇటు బ్రహ్మమూ, రెండూ మానవుడికి శ్రేయోదాయకాలు కాబట్టి ఇవి రెండే వాస్తవంలో పురుషార్ధాలు. ఇహంలోనే గాక పరంలోనూ సుఖప్రదాలివి. ఇదుగో వీటి రెండింటి స్వరూపాన్ని మానవులకు బోధించడమే శాస్త్ర ప్రయోజనం. అసలు శాస్త్రమనేది అందుకోసమే అవతరించింది. శాస్తీతి శాస్త్రమన్నారు. శాసించేదేదో అది శాస్త్రం. ఇది నీకు హితం-దీనినాచరించు -బాగుపడతావని ఉపదేశించటమే శాసనం. అది ధర్మ బ్రహ్మముల విషయంలోనైతేనే చెల్లుతుంది. అర్థకామాల విషయంలోనైతే అవసరం లేదు. అర్థ కామాలనేవి కేవలమైహికానికి చెందినవి. లోక వ్యవహారం వల్లనే సిద్ధిస్తున్నది వాటి జ్ఞానం. దానికి క్రొత్తగా ఒక శాస్త్రం దేనికి. పోతే మన చక్షురాదికమైన ప్రత్యక్ష ప్రమాణానికి మనస్సనే అనుమానానికీ కూడా అందని అతీంద్రియమైన వారెండు పురుషార్థాలే కాబట్టి వాటి నిదమిత్థమని బయట పెట్టడానికే మూడవదైన శాస్త్ర ప్రమాణమావశ్యక మయింది. శాస్త్రమంటే ఇక్కడ మన తర్క వ్యాకరణ వైద్యజ్యౌతిషాదులు కావు. అవీ శాస్త్రాలే ఒక విధంగా కాని శాస్త్రమనే మాట ఇక్కడ పారిభాషికం Technical. దానిని బట్టి చతుర్విధమైన వేద వాఙ్మయానికే ఇక్కడ శాస్త్రమని వ్యవహారం.

  అంతేకాదు. అపౌరుషేయమైన శ్రుతివరకే గాక ఈ వ్యవహారం పౌరుషేయమైన స్మృతుల వరకూ మనం పొడగించవచ్చు. శ్రుతులెంతో స్మృతులంతే. శ్రుతులు ప్రతిపాదించిన అర్థాన్నే స్మృతులు కూడా అనువదిస్తాయి. అది అపౌరుషేయమైతే ఇది పౌరుషేయం. అంతే తేడా. స్మరించేదేదో అది స్మృతి. స్మరించట మంటేనే

Page 21

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు