బాగా హింసిస్తే చివరకది సగుణమో, నిర్గుణమో ఆ దైవం తేలిపోతుంది. సగుణమే అయిందా తనదే పైచేయి. నిర్గుణమే సగుణంలా భాసించిందా దాని చేతిలో తనకు నిజంగానే మరణం తప్పదు. అందులో మొదటిది తనకు యథాపూర్వంగా వైకుంఠ ద్వారపాలకత్వాన్ని ప్రసాదిస్తే రెండవది అంతకన్నా అతీతమైన మోక్ష సుఖాన్నే అనుగ్రహిస్తుంది. ఏదైనా తనకు నష్టం లేదు గదా అని తన ఉద్యమాన్ని తీవ్రతరం చేయసాగాడు.
ఇదంతా మనసులో పెట్టుకొని ఇక వీణ్ణి హింసించి లాభంలేదు. వీడి దగ్గరే ఉందా ప్రభావం. అదేదో తెలుసుకొందామని వాడితో ప్రశ్నోత్తరాల కుపక్రమించాడు. "అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెఱచు -నేల వెఱవవు పలువ నీకేది దిక్కు" మరి ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్ద్వేషులయి కూడా మదీయాజ్ఞా భంగం సేయనోడుదురే. అట్టిచో నీవెలా నా ఆజ్ఞోల్లంఘన చేయగలిగావు చెప్పమంటాడు. అంతేకాదు. కంఠక్షోభము గాగ నొత్తిలి మహాగాఢంబుగా వైకుంఠుడు వైకుంఠుడని ఘోష పెడుతున్నావే. ఏడీ ఆ వైకుంఠుడెక్కడున్నాడు. ఉంటే మరినే నమరులన్ ఖండింప దండింపగా కుంఠీభూతుడు గాక రావలదే. మరి రాలేదే. ఎందుకనిరాలేదు. చెప్పమని నిలదీస్తాడు. "దిక్కులు గెలిచితినన్నియు దిక్కెవ్వడు రోరి నీకు. బలవంతుడనే జగముల మహాబలుల జయించితి నెవ్వని బలముననాడెదవు నాకు బ్రతి వీరుడవై" ఆ దిక్కేదో, బలమేదో బయటపెట్టమని గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతాడు.
ఎక్కడో ఉన్నదది చూపుతాడని వాడి ఆశ. అది ఎక్కడైనా దొరికే పదార్ధమైతేగా అందుకే జవాబిస్తున్నాడు ప్రహ్లాదుడు. బలమెవ్వడని అడుగుతున్నావు.
బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బల మసురేంద్రా
తనకే గాదట తనతండ్రికి బలం కూడా అదేనట. హింస పడినా తట్టుకొనేందుకు తనకు బలమైతే, హింస పెట్టేందుకు తండ్రికి కూడా బలమదే. అప్పటికి హిరణ్యకశిపుడి కున్న బలమూ, ప్రహ్లాదుడిలో ఉన్న బలమూ ఒక్కటే. సర్వాత్మకమైన తత్త్వమయినప్పుడు రెండు బలాలెక్కడ నుంచి వస్తాయి. రెండూ ఒకటని చూస్తున్నాడు
Page 345