హామీ ఇచ్చిపోయాడా బ్రహ్మ. ఇక తాను చస్తాననే భయం దేనికా దానవుడికి. అయినా భయపడుతున్నాడు.
ఇక్కడే ఉంది పెద్ద రహస్యం. మామూలుగా చూస్తే భయపడవలసిన అగత్యం లేదు. కాని ఒక విషయం ఆశ్చర్యం గొలుపుతున్నది వాడికి. తానెంత దారుణంగా హింసించినా చావటం లేదా బాలుడు. వాడేమీ తనలాగా తపస్సు చేయలేదు. వరాలు సంపాదించలేదు. ఏ సాధనా లేకుండా వాడెందుకు చావడు. ఏమిటా ప్రభావం. ఎక్కడి నుంచి వచ్చింది. ఏదో ఒక మహిమ లేకపోతే ఇలా జరగటానికే మాత్రమూ వీలులేదు. అది తపస్సు లేకుండానే వాడికి సంక్రమిచిందంటే తనకంటే మహిమాన్వితుడయి ఉండాలి. ఏమిటా శక్తి. అది సగుణమా, నిర్గుణమా. సగుణమని విశ్వసిస్తున్నాడు తానింతవరకూ. కాదు నిర్గుణం పొమ్మని మాటిమాటికీ హెచ్చరిస్తున్నాడు వాడు. బహుశః ఫలితాన్ని బట్టి చూస్తే వాడు చెప్పిందే వాస్తవమేమో. అయినా తన భ్రాతను చంపినప్పుడు సగుణరూపంతోనే చూపట్టాడే ఆ దేవుడు. నిర్గుణమని ఎలా భావించటం. కాకుంటే వీడికీ అనన్యా దృశమైన ప్రభావమెక్కడిది.
ఇలా ఏదీ తేల్చుకోలేని విచికిత్సలో పడ్డాడు హిరణ్యకశిపుడు. అసలది ప్రహ్లాదుడు చెప్పినట్టు నిర్గుణమే అయితే తన విశ్వాసమంతా ఇక అబద్ధమే. అబద్ధమే అయితే బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరాలూ అకించిత్కరమే. ఎందువల్ల. “గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరి గ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవన" మిప్పించమని కదా వాడు కోరాడు. ఆయన ఇచ్చాడు. ప్రస్తుతమీ బాలుడలాంటి తపస్సూ వరాలు లేకుండానే తాను ప్రయోగించిన అస్త్రశస్త్రాదుల వల్ల చెక్కు చెదరకుండా బ్రతికాడు. అలా బ్రతికాడంటే బ్రహ్మకతీతమైన శక్తివల్లనే బ్రతికి ఉండాలి. అలాంటప్పుడిక బ్రహ్మ వరాలంతకంటే తక్కువే గదా. అవి పని చేస్తాయని ఇక ఏమి నమ్మకం. అని పెనుభయం పట్టుకొన్నది వాడికి. ఇంతకూ సగుణంగా కనిపించిన దేవుడు తనకిచ్చిన వరం కంటే నిర్గుణంగా ఎవరి కంటికీ కనిపించకుండానే కుమారుడికి తోడుపడే వెలుపే మహిమాన్వితుడనే అనుమానం కూడా రేకెత్తింది చిత్తంలో. ఇదేదో ఐసా పైసా తేల్చుకోటం మంచిదని భావించాడు. ఆ కుర్రవాడి నింకా బాధించి వాడి అంతు చూద్దామనుకొన్నాడు
Page 344