లేకపోరు. అలాటి వారికిచ్చే ఆఖరు సమాధానమొక్కటే. అదేమిటంటే భాగవతమొక పురాణమనే విషయం మరచిపోతున్నారు వారు. పురాణమంటే అది ఒక అర్థవాదం. అర్థవాదాలన్నీ సత్యంకావు. సత్యానికవి కేవలం సంకేతాలే నని మొదటనే చెప్పాము. తద్ద్వారా ప్రతిపాద్యమైన సత్యాన్నే పట్టుకోవాలిగాని మనం దానిపైన గప్పిన కథ అనే కవచాన్ని పట్టుకొని ప్రాకులాడరాదు. ప్రస్తుతమీ ప్రహ్లాదోపాఖ్యాన మొకానొక సత్యాన్ని మనకు బయట పెడుతున్న సంకేతమేననుకొంటే సరిపోతుంది. గజేంద్రుడి కథలాగా ఇదీ ఒక కథే. అది మానవుడి దేహాత్మాభిమానానికెలా ప్రతీకమో ఇదీ బ్రహ్మాత్మభావ రూపమైన వరమాహ్లాదానుభూతిని సూచించే ఒకప్రతీక. అలా అద్వైతానందాన్ని అనుభవిస్తున్న దశలో జీవన్ముక్తుడైన మహాయోగికిక దేహమూ లేదు. మాత్రా స్పర్శలూ లేవు. తన్నిమిత్తంగా కలిగే సుఖదుఃఖాదులూ లేవు. అంతా బ్రహ్మ స్వరూపమే. ఆత్మస్వరూపమే. అలా పరిణమిస్తేనే అది ముక్తి. క్రొత్తగా పరిణమించటం కూడా కాదిది. పూర్వ సిద్ధమేనని ఘోషిస్తున్నది శాస్త్రం. కనుక అలాటి లోకోత్తర భూమికను నిరూపించేందుకీ ప్రహ్లాద వృత్తాంతాన్ని ఒక ఆలంబనంగా తీసుకొని లోకానికి బోధిస్తున్నాడు భాగవతకారుడు. అంచేత ఎలాంటి విప్రతిపత్తికీ ఇక్కడ చోటులేదు అంతా చతురశ్రమే.
అయితే మనకు గాకపోయినా హిరణ్యకశిపుడికే కలిగింది ఇలాటి వితర్కం. ఇంతపని చేసినా వీడు చావకపోవటమేమిటా అని ఆశ్చర్యపోయాడు. "వీడెవడో మహా ప్రభావుడు వీనికెందును భయంబు లేదు. వీని తోడి విరోధంబున దనకు మృత్యువు సిద్ధించు"నని నిర్ధారణ చేసుకొన్నాడట. అంటే హిరణ్యకశిపుడప్పటికి ఒక విషయం చక్కగా గ్రహించాడు. ఎంత చెడ్డా వేదాంత విద్యావిశారదుడు గదా. మహా ప్రభావ మెవడికుంటే వాడికి దేనివల్లా భయం లేదు. ఏమిటా ప్రభావం. బ్రహ్మానందానుభవమే. "ఆనందమ్ బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కుతశ్చన” అని చాటుతున్న దుపనిషత్తు. ఆ మాట కనుగుణంగా ఉన్నదీ మాట. అంతేకాదు. వీడితో విరోధం పెట్టుకోటం వల్ల నాకు మరణం తప్పదంటున్నాడు. వాడు చావటం దేవుడెరుగు వాడి మూలంగా నేను చస్తానేమో నని భయపడుతున్నాడు. ఇదేమిటి. తాను బ్రహ్మదేవుడి వల్ల మరణమనేది లేకుండా బ్రహ్మాండమైన వరం పొందాడు గదా. మృత్యువులేని జీవనం గదా అతడు కోరింది. అలాగే ఇచ్చాను పొమ్మని గదా
Page 343