వీటన్నిటినీ ఆగమాపాయులుగా అనిత్యాలుగా చూడగలవాడికే అలాటి తితిక్ష అబ్బుతుంది. అది సర్వాత్మభావ రూపమైన జ్ఞానమొక్కటే ప్రసాదిస్తుంది. జ్ఞానం పదిలమైతే అది ఐశ్వర్యంగా మారుతుంది. ఐశ్వర్యమంటే ఈశ్వరభావం. సృష్టిలో దేనినైనా జయించగలగటం అదుపులో పెట్టగలగటమే అది. దానికే యోగమని మరొక పేరు.
నతస్య రోగో నజరానమృత్యుః ప్రాప్తస్య యోగాగ్ని మయమ్ శరీరమ్
యోగ శరీరం పొందిన జ్ఞానికి జరారోగాదులు లేవు సరిగదా. మరణ భయం కూడా లేదని శాస్త్ర ప్రమాణం. ఇలాటి జ్ఞానీయోగీ ఆ ప్రహ్లాదుడు. కనుకనే శరీరం దెబ్బ తినలేదు.
కాకపోయినా ప్రారబ్ధం తీరే వరకూ ఏ బాధలూ ఏమీ చేయలేవు మానవుణ్ణి. ఎలాటి ప్రాణోపద్రవమూ సంభవించదు. బ్రతికే యోగముంటే ఎన్ని ఉపద్రవాలు సంభవించినా చెక్కు చెదరదు ప్రాణి. ఎలాగో ఒకలాగు తప్పించుకొంటాడు. అలాటి యోగం లేకుంటే ఎన్ని ఉపాయాలు పన్ను. ఎంత సహాయ సంపద పొందు. అవి ఏమీ కాపాడలేవు. క్షణంలో మృత్యువు వాతపడతాడు. ఇది మనదైనందిన జీవితంలోనే తార్కాణ అయ్యే సత్యం. చచ్చే పరిస్థితిలో కూడా కొందరు చావరు. అలాగే బ్రతుకుతుంటారు. మన కాశ్చర్యంగా ఉంటుంది. వీడెలా బ్రతకగలిగాడా అని. ఎంత మాత్రమూ చావటానికి వీలులేని మహాబలిష్ఠులూ ఆరోగ్యవంతులూ ఉన్నట్టుండి కన్ను మూస్తారు. అది మనకింకా ఆశ్చర్యం. ఎలా జరిగిందా ఇంత పని అని. కాబట్టి.
అరక్షితమ్ తిష్ఠతి దైవ రక్షితమ్ - సురక్షితమ్ దైవ హతమ్ వినశ్యతి
అన్నట్టు ప్రాణులకు కలిగే కష్ట సుఖాలూ, జనన మరణాలూ, అన్ని వారి వారి ప్రారబ్ద కర్మానుసారంగా నడుస్తుంటాయి. ఎప్పుడేది ఎవరికి ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పేది కాదు. చేసేది కాదు. గుడ్లప్పగించి చూసేదే. అందుకే అనిర్వచనీయ మన్నారీ సంసార యాత్ర. ఇలాటి ఒకానొక అనిర్వచనీయమే ఈ మహాభాగవతుని వ్యవహారం కూడా.
అయినా పాంచ భౌతికమైన దేహం ఇంత దారుణంగా హింసించినా పంచత్వం పొందక పోవటమేమిటి. ఇది మేము నమ్మమని హేతువాదానికి దిగే వారింకా
Page 342