బతికి ఉంటాడా. బ్రతికి ఉండటానికది పాంచ భౌతికమైన శరీరమా, మరొకటా. పాంచ భౌతికమైనప్పుడది జ్ఞానికైనా ఒక్కటే. అజ్ఞానికైనా ఒక్కటే దెబ్బ తినవలసిందే. ఛిన్నాభిన్నమై పోవలసిందే. తప్పదు. అలాంటప్పుడా ప్రహ్లాదుణ్ణి కొండలమీది నుంచి దొర్లించారు. నీళ్లలో ముంచారు. నిప్పుల్లో త్రోశారు. రాళ్లతో రువ్వారు. కత్తులతో చువ్వారు. అయినా చెక్కు చెదరలేదట శరీరం. ఏమి కారణం. ఇది కథా. యథార్ధమా. కథయితే నమ్మనక్కరలేదు. యథార్థమనుకొంటే మన అనుభవానికే విరుద్ధం. మరి ఏమిటి గతి అని ప్రశ్న.
ఇక్కడే ఉంది మనం గ్రహించవలసిన మహా రహస్యం. నిర్గుణ బ్రహ్మాత్మభావ సంపన్నుడైన ఒక మహనీయుని స్థితిని వర్ణిస్తున్నదీ ఘట్టం. స్థితప్రజ్ఞుడైన వాడి లక్షణాలు మనకు శాస్త్రంలో కనిపిస్తాయి. యస్మిన్ స్థితో న దుఃఖేన గురణాపి విచాల్యతే. ఆ దశలో ఉన్నవాడికెంత పెద్ద దుఃఖం కూడా ఏమీ చేయలేదట. ఆ శాస్త్ర వాక్యానికిది ఉదాహరణ. అంతేకాదు. “దేహీ నిత్యమవ ధ్యోయమ్ దేహే సర్వస్య భారత” దేహమే వధ్యంగాని దేహివధ్యుడు కాడు. ఎందుకంటే దేహంలాగా అది భౌతికం కాదు. అభౌతికమైన తత్త్వం. అభౌతికం గనుకనే
నైనంఛిందంతి శస్త్రాణి - నైనం దహతి పావకః నచైనం క్లే దయంత్యాపో - నశోష యతి మారుతః
దాన్ని శస్త్రాలు ఛేదించలేవు. అగ్న్యాదులు దహించలేవు. జలరాశి ముంచలేదు. వాయువు వట్టిపో జేయలేదు. కారణం. "నిత్య స్సర్వగతః స్థాణు రచలోయమ్ సనాతనః" ఆత్మకంతం లేదు. ఆదిలేదు. అది సర్వగతం. అచలం. స్థిరం. అలాంటి స్థిరమైన తత్త్వాన్ని పట్టుకొని అదే తానని తాదాత్మ్యం చెందినవాణ్ణి ఏదిగాని ఏమీ చేయగలదు. అస్థిరం స్థిరాన్ని హింసించటమెలా సాధ్యం. ఆ గీతా సిద్ధాంతానికి ప్రహ్లాదుడి ఈ వ్యవహారమొక దృష్టాంతం లాంటిది. ఆ మాటకు వస్తే భాగవతమంతా దృష్టాంతమే. భగవద్గీత సిద్ధాంతం భాగవతం దృష్టాంతమని గదా మన రాద్ధాంతం. ప్రస్తుతం ప్రహ్లాద కుమారుడి శరీరం భౌతికమైనా దెబ్బ తినలేదంటే అది తితిక్షా ప్రభావం చేతననే గ్రహించాలి మనం. తితిక్ష అంటే ద్వంద్వాలను సహించే సామర్ధ్యం.
"మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాః” ఈ సుఖదుఃఖాలే ద్వంద్వాలు..
Page 341