#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

చంపండి ఈ తెంపరినని ఆజ్ఞాపిస్తాడు. చూడండి. అంత విద్యావంతుడయి కూడా అంత అఘాయిత్యమో. అర్థం కాకపోతే అఘాయిత్యమే మరి. దుష్టాంగాన్ని ఖండించి శేషాంగానికి రక్ష చేసినట్టు చేస్తాడట రక్షోవంశాన్ని ఆ క్రుర్రవాడని ఒకణ్ణి శిక్షించి. నిజంగా దుష్టాంగం తాను. వాడు గాదు. అంత ఆత్మజ్ఞానముంటే ఇకనేమి. బాగుపడడా. అలాపడే యోగం లేకనే ఇలాటి మిథ్యా గ్రహం.

  స్వామి ముదల అయిందో లేదో ఇక బయలుదేరారా రాక్షస కింకరులంతా కేకలు వేస్తూ. వాడి మొనలు గల శూలాలు శరీరంలో గ్రుచ్చి బాధింపజొచ్చారు. కిక్కురు మనలేదా బాలుడు. పాఱడు లేచి దిక్కులకు. బాహువు లొడ్డడు. మరేమి చేశేవాడు. “తన్ను నిశాచరుల్వొడువ దైత్య కుమారుడు మాటిమాటికో- పన్నగ శాయి యోదనుజ భంజన” అని బిగ్గరగా అరచేవాడు. ఇది అరపు గాదు. సర్వాత్మకమైన ఆ పరబ్రహ్మము తానయయి యమ్మహా విష్ణువునందు చిత్తంబు చేర్చి తన్మయుడయి పరమానందంబు నం బొంది యున్న ప్రహ్లాదుని ఆనందాక్రందనం. అంతా బ్రహ్మమే. అది తన ఆత్మేనని చూచే ఆస్థిత ప్రజ్ఞుడికి శూలమో, భిండివాలమో అంతా భగవంతుని ఇంద్రజాలమే. మరేదీ గాదు. అలాంటి సర్వ సమదర్శనుణ్ణి ఆ విషమ దర్శనుడింకా బాధింపజూస్తాడు.

ఒకనాడు దిక్కుంభి యూథంబు దెప్పించి కెరలి డింభకుని ద్రొక్కింప బంపు నొకమాటు విషభీక రోరగ శ్రేణుల గడువడి నర్భకు గఱవ బంపు ఇంతెందుకు.


“విషము పెట్ట బంపు- విదళింపగా బంపు- దొడ్డకొండ చఱుల ద్రోయ బంపు – పట్టికట్ట బంపు బాధింపగా బంపు” అంతే గాదు. “నీరు నన్నంబు నిడ నీక నిగ్రహించు – కశల నడిపించు ఱువ్వించు గండశిలల - గదల వేయించు - నేయించు ఘన శరముల”


  ఏతాదృశ నానావిధ ఘాతన క్రియలెన్ని చేయించినా చెక్కు చెదరలేదా బాలుడు. ఏమి కారణం. ఎవడైనా ఇలాంటి ఘోరమైన ఆయుధాలు ప్రయోగిస్తే చావకుండా

Page 340

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు