జెచ్చెర బుట్టునే పరులు చెప్పిన నైన - నిజేచ్ఛనైన - నే మిచ్చిన నైన - కానలకు నేగిన నైన హరి ప్రబోధముల్
నీకీ బుద్ధి ఎవరూ చెప్పకుంటే ఎలా వచ్చిందని గదా అడిగారు మీరు. వారి వారి సుకృత విశేషాన్ని బట్టి రావాలి గాని ఒకరు చెబితే వచ్చే దదేమి బుద్ధి ఒకరు చెప్పినా రాదు. తాను కోరినా రాదు. ధనమిచ్చినా రాదు. వనభూములకు పోయినా రాదు. ఎటువచ్చీ అనేక జన్మ సంసిద్ధః అన్నట్టు బహు జన్మ కృత ప్రయత్నానుగతమై రావాలి గాని ఉట్రవడియంగా వచ్చి ఒళ్లోబడేది గాదని తెలుసుకోమంటాడు.
మరి నీకలాటి బుద్ధి కలగలేదనేందుకు గూడా కారణముంది. ఎందుకంటావేమో
కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుం గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై కానరు విష్ణు ..
విష్ణువంటే నీవు తేలికగా చూస్తున్నావు. ఎక్కడో నక్కి ఉన్నాడు. పోయి పట్టుకొందామని భ్రమ పడుతున్నావు. అది ఒక గ్రుడ్డివాణ్ణి పట్టుకొని మరొక గ్రుడ్డివాడేదో వెళ్లి చూడాలనుకోటం వంటిది. కర్మమార్గంలో పయనించే నీ బుద్ధికి జ్ఞానైక గోచరమైన ఆ మహాఫలమెలా అందుతుంది. అయితే ఎవరి కందుతుందంటావేమో. అకించనులై- వైష్ణవాంఘ్ర సంస్థాన రజోభిషిక్తులై సంహృత కర్ములైన వారెవరో వారికి. మరి నీవెన్నో శోధించావు నన్ను శోధించమంటున్నావు. దేనికిన్ని గాథలు. మాధవ శేముషీ తరణి సాంగత్యంబు నంగాక దుర్మేధన్దాటగ వచ్చునే. ఏమిటది. సుతవధూ మీనోగ్ర వాంఛా మదక్రోధోల్లోల విశాల సంసృతి మహాఘోరామితాం భోనిధి. ఇలాటి అంభోనిధి దాటాలంటే సమ్యగ్ జ్ఞానమనే బోటు తప్ప మరేదీ పాటుగాదు సుమా.
అని ఇలా సూటిగా చెప్పే సరికది ఘాటుగా తగిలి ఆ రాక్షసుడి కది తలకెక్కక పోగా అక్కడి సభాస్తారులను చూచి చూచారావీడు నాకు తనయుడై యుండి పగవాడి ప్రాపు చేరి నన్నెంతగా బాధ పెడుతున్నాడో. చూడబోతే అయిదేండ్లైనా నిండలేదీ కొండికకు కించిత్తు కూడా భీతి లేక అ రాతిని కీర్తిస్తున్నాడు. వద్దంటే మానడు. వీడు నాకు తనూజుడు కాదు. తనూజమైన ఒకానొక ప్రబలవ్యాధి. పట్టండి కొట్టండి
Page 339