దానికి ప్రహ్లాదుడిచ్చిన జవాబు చూడండి ఎంత చక్కగా ఉందో
అజ్ఞుల్ కొందఱు మేము తామనుచు మాయంజెంది సర్వాత్మకుం బ్రజ్ఞాలబ్ద దురన్వయ క్రమములన్ – భాషింపగా నేర జిజ్ఞాసా పథమందు మూఢులు గదా చింతింప - బ్రహ్మాది వే దజ్జుల్ - తత్పరమాత్ము విష్ణు- నితరుల్ దర్శింపగా నేర్తురే
తండ్రీ నీవు పొరబడుతున్నావు. సర్వమున్నతని దివ్యకళామయమని నేను చెబితే నీవా విష్ణువెక్కడో ఉన్నాడని భావిస్తున్నావు. సర్వాత్మకుడు విష్ణువంటే. కేవలం తెలివితేటలతో అన్వయం చేసుకొని భాషించేది కాదది. అలాగైతే వేదవేత్తలైన బ్రహ్మాదులెప్పుడో గ్రహించి ఉండేవారు. కాని వారికి కూడా అంతుచిక్కింది కాదా తత్త్వం. ఇక నీబోటి వారేమిటి. దాన్ని దర్శించటమేమిటి. మరి నాబోటి వారికంటావా. ఇనుమయస్కాంత సన్నిధిలో మాదిరా హృషీకేశు సన్నిధిలో చిత్తం కరిగి దానితో ఏకమవుతున్నది. అది అంబుజోదర దివ్య పోదార వింద చింత నామృత పాన విశేషమత్తమైన చిత్తం. దానికన్యమనే భావం లేదు. అంతా అనన్య భావనే.
ఈ అనన్య భావన అంటే ఏమిటో ఆ మొద్దు కర్థం కాలేదు. వీడెప్పుడూ ఆ రక్షస కులాంతుకుణ్ణి ప్రస్తుతి చేస్తున్నాడు పట్టండి కొట్టండని ఆజ్ఞాపిస్తాడు. అయ్యా అప్పుడే అంత కోపతాపాలు పెట్టుకోకండి. మేము మరలా ప్రయత్నిస్తామని తీసుకెళ్లుతా రాచండామార్కులు. శతవిధాల నూరిపోస్తారదీ ఇదీ ఎన్నో విద్యలు. నాయనా ఇక మా మతము త్రిప్పకు. మేము చెప్పినవి తప్పకు. అని తెచ్చి హిరణ్యకశిపుని ముందు నిలుపుతారు. నిలిపితే అతడీ లోకంలో ఉంటే గదా. అఖిల ప్రపంచంబు శ్రీవిష్ణుమయమనే ఆ తొల్లింటి భావనలోనే పాదుకొని ఉన్నాడు. నాయనా తండ్రిగారికి మ్రొక్కమంటే మ్రొక్కాడు. ఆహా ఎంత బుద్ధిమంతుడయ్యాడు నా కుమారుడని తొడమీద కూచోబెట్టుకొని ముద్దుచేస్తూ నాయనా ! ఏమిమి విద్యలు నేర్చావు. నీ విద్యాసారమెఱుంగ గోరెద, భవదీయోత్కర్షముం జూపవే అని అడుగుతాడు. అడగటమే తడవుగా చదివించిరి నను గురువులు - చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్త్రంబులు నే జదివినవి గలవు పెక్కులు. అవన్నీ నీకు దేనికి. ఒక్క మాట చెబుతాను విను. చదువులలో ఏది మర్మమో అది చదివానంటాడు. ఏమిటా మర్మమంటే ఏ కరువు పెడతాడిక.
Page 337