శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాదసం ధానుండై మఱచెన్ సురారిసుతు డేతద్విశ్వమున్ భూవరా
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ననే శాస్త్రధ్వని కిది పురాణం చేసే ప్రతిధ్వని. ఇలాంటి పరావరమైన తత్త్వాన్ని పట్టుకొని కూచున్నాడా ప్రహ్లాదుడు. అలాటి పరవిద్యా సంపన్నుడి కలవడిన విద్య ఏమిటో ఈ జడుడి కర్థం కాలేదు. అర్థం కాక వాణ్ని జడుడనీ వాడికేదో విద్య నేర్పించాలనీ యత్నిస్తాడు పాపం.
వెంటనే శుక్ర కుమారులు చండామార్కులనే వారిని పిలిపిస్తాడు. పిలిపించి వారితో “అంధ ప్రక్రియ నున్నవాడు పలుకం డస్మత్ప్రతాప క్రియా గంధం బించుకలేదు ఈ బాలకున్ గ్రంథంబుల్ సదివించి నీతి కుశలుణ్ణి" గావించమని అప్పగిస్తాడు. చూడండి వాడి అహంకారం. తనప్రతాప క్రియాగంధముంటేనే వాడు విద్యావంతుడట లేకుంటే వాడు జనుషాంధుడే. నీతి కుశలత లేనివాడే. సరే వీడికి తోడుపోయిన వారే ఆ గురుపుత్రులు. వారేది చెప్పినా ప్రహ్లాదుడవుననడు. కాదనడు. అన్నీ నిరూపిస్తే మిథ్యాభూతమే గదా ఎట్లైతే నేమని అతని బరవసా. పిలిపించి పరీక్షిస్తాడొకనాడా తండ్రి కుమారుణ్ణి. నీకేది పట్టుపడిందో చెప్పమని అడిగితే వాడు తడువుకోకుండా.
ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి లోపలం ద్రెళ్లక మీరు మేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణు నం దుల్లము సేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ
అని అద్వితీయాత్మ భావాన్ని బోధిస్తాడు. ఇందులో సర్వమున్నతని దివ్యకళామయమదే విష్ణు స్వరూపమనే మాట అతడెప్పుడూ విన్నది గాదు. విష్ణువంటే అతని దృష్టిలో ఈ సృష్టిలో ఎక్కడో ఏ వైకుంఠంలోనో దాగి ఉన్న ఒక పురుష విగ్రహం. అది తన్ను తప్పించుకొని తిరుగుతున్నది. ఎప్పుడో వెళ్లి పట్టుకోవాలని పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు వాడు. అలాంటివాడికీ నిర్గుణస్థాయిలో ఆడిన మాటలే మాత్రమూ అంతుపట్టలేదు. పట్టకనే “నాకుం జూడగ చోద్యమయ్యెడి గదా నా తండ్రి – ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాప రాధు డతనిన్ వర్ణింప నీకేటికిన్” అని మందలిస్తాడు. విష్ణువంటే అతనికి వైకుంఠ పురవాసియే. అంతకు మించి మరెక్కడా కనిపించదా తత్త్వం.
Page 336