అందులో దేవతలది సత్త్వగుణమైతే- అసురులది రజోగుణమైతే తమోగుణం యక్షరక్షస్సులది. వీరి వీరి గుణాల కనుగుణంగా ఒకరితో ఒకరు కలహిస్తుంటే ఆయన వారి కాల స్వభావ కర్మల ననుసరించి రక్షిస్తూ, శిక్షిస్తూ ఉన్నట్టు తోస్తున్నాడు. ఇంతకూ బాధ్య బాధకాలు రెండూ ఆయన స్వరూపమే. అయినా రెండు విరుద్ధ రూపాలుగా భాసించటం కేవలమాయన గారి మాయ.
దీనిని బట్టి సాత్వతులైన ప్రహ్లాదాదులు ఎందుకు బాధ పడ్డారని ప్రశ్నలేదు. వారిని హిరణ్యాదులెందుకు బాధించారని ప్రశ్నాలేదు. అది వారి వారి స్వభావాని కనుగుణంగా జరిగిన వ్యవహారం. "స్వభావో దురతి క్రమః - స్వభావస్తు ప్రవర్తతే” స్వభావాన్ని దాటి ఎవడూ పోలేడు. హిరణ్యకశిపుడు రజో దోష దూషితుడు కాబట్టి వాడి దృష్టి అంతే. అది శుద్ధ సత్త్వ సంపన్నుడైన ప్రహ్లాదుడి స్థాయి కెదగమంటే ఎలా ఎదుగుతుంది. ఎదగదు. ఎదగలేదు. లేకనే ఇరువురి మధ్యా ఆ పోరాటం. అసలు తపస్సు చేసి బ్రహ్మవల్ల వరాలు పొందినప్పుడే వాడి రజోగుణం బయట పడుతుంది. మరణం లేకుండా అనుగ్రహించమంటాడాయనను. ఇది సాధ్యమా, సాధ్యమే. అయితే రాజసమైన ప్రవర్తన ఉన్నంతవరకూ కాదు. శుద్ధ సత్త్వ బుద్ధితో ఉత్తమ జ్ఞానమార్జించినప్పుడే అది సాధ్యం. అది ఎక్కడ తెచ్చి ఇస్తావా దానవుడికి. అది లేకుండానే ఇంత మహాఫలాన్ని చవిచూడాలని కోరుకోవటం వట్టి అవివేకం. ఇలాటి అవివేకికా ఫలాన్ని ప్రసాదించానని పితామహుడు హామీ ఇచ్చినా అది ఎలా నెరవేరుతుంది. అందులోనే దాగి ఉంటుందెంతో మోసం. అది తెలియదా దానవుడికి. రాజస ప్రకృతికది మాత్రమెలా బోధపడుతుంది. పడకనే తానిక అజరామరుడనని తలపోశాడు. దానితో గరుడ గంధర్వాది దేవతలనందరినీ బాధించసాగాడు.
ఒకనాడు గంధర్వ యూధంబు పరిమార్చు దివిజుల నొకనాడు తెరలదోలు భుజగుల నొకనాడు భోగంబులకుబాపు గ్రహముల నొకనాడు కట్టివైచు కడిమి నొకనాడు కిన్నర ఖచర సాధ్యచారణ ప్రేతభూత పిశాచ వన్య సత్త్వ విద్యా ధరాదుల సంహరించు
ఇలా మారు లేకుండా మసలజొచ్చాడు. "ఏ దిక్పాలుర జూచి నేడలుగునో ఏదేవు బంధించునో” అని వారంతా భయాందోళనలతో విలపించేవారు. చివరకేదీ
Page 334