విజయులంటే రజస్తమో గుణాలే. అవే మానవుని మోక్షద్వారంలో ప్రవేశించకుండా అడ్డు తగులుతున్నాయి. అందులో ఒకటి చిత్తానికి విక్షేపమిస్తే మరొకటి ఆవరణ చేస్తుంది. ఆవరణాత్మకమేతమస్సు. అది ఆత్మ చైతన్యాన్ని కప్పి పుచ్చుతుంది. విక్షేప మాత్మేతరమైన సంసార బాధలు తెచ్చి పెడుతుంది. అది రజస్సు. ఇందులో తమస్సుకన్నా రజస్సు ప్రమాదకరమైంది. అది మొద్దులాగా పడి ఉండటం వరకే. ఇది అలాకాక నలుమొగాల విజృంభించి మన ప్రాణం తీస్తుంది. ఇందులో జయ విజయులీ రెండు గుణాలనూ పంచుకొని జన్మించారు. జయుడు రజస్సయితే విజయుడు తమస్సు. ఆజయుడి రూపాంతరాలే కృతంలో హిరణ్యకశిపుడూ, త్రేతలో రావణుడూ, ద్వాపరంలో శిశుపాలుడూ. భగవంతుని నిందించినా, భగవద్భక్తులను బంధించినా ఆ ఆరం భారం నెత్తిన వేసుకొన్న వారు వీరే. హిరణ్యకశిపుడిది కూడా ఇలాటి రాజస ప్రకృతి.
రాజసంలో ఉండే మరో రహస్యమేమంటే ఇది తమస్సులాగా జడమూ కాదు. సత్త్వంలాగా శుద్ధచేతనము గాదు. జడమైతే ఏ జ్ఞానానికీ నోచుకోక ఊరక మొద్దులాగా పడి ఉండేది. అలా పడి ఉన్నవారే కుంభకర్ణాదులు. మరి శుద్ధచైతన్యమైతే పరమార్థ జ్ఞానమే గడించి తరించి ఉండేది. పోతే అటూ ఇటూ గాని దశ ఇది. జ్ఞానమసలు లేనిదీ గాదు. ఉంటే పూర్తిగా ఉన్నదీ గాదు. హిరణ్యకశిపుడి దశ ఇలాంటిది. జ్ఞానమున్నవాడే. జ్ఞానమంటే కేవల లౌకిక జ్ఞానమే గాదు. ఆ మాటకు వస్తే తత్త్వజ్ఞానం కూడా గడించినవాడు. అదే గదా ఇంతకు ముందు వర్ణిస్తూ వచ్చాము. కాబట్టి జ్ఞానవంతుడని చెప్పటాని కభ్యంతరం లేదు. అయితే మరి వచ్చిన తిరకాసేమిటి. జ్ఞానముందేగాని అది రాజసం. సాత్త్వికం కాదు. సత్త్వాత్సంజాయతే జ్ఞానమ్. సత్త్వం వల్లనే సరియైన జ్ఞానమేర్పడేది. అది రజస్తమస్సులున్నంత వరకూ లాభం లేదు. అవి రెండూ క్షాళితమై సత్త్వం శుద్ధి కావాలి. ఆ క్షాళనమే సన్న్యాసం. "సన్న్యాస యోగా ద్యతయ శ్శుద్ధ సత్త్వాః” అని ఘోషిస్తుంది శాస్త్రం. సన్న్యాస యోగం వల్లనే శుద్ధ సత్త్యులయ్యారట మహాత్ములు. అయినందుకేమిటి గుర్తు. విశుద్ధ సత్త్వ స్తతస్తుతమ్ పశ్యతే నిష్కలమ్. విశుద్ధ సత్త్వులైన మహాజ్ఞానులా తత్త్వాన్ని నిష్కలంగా చూడగలుగుతారట. అంటే సగుణంగా పరిచ్ఛిన్నంగా కాక నిర్గుణంగా సర్వవ్యాపకంగా దర్శిస్తారు.
Page 330