“ప్రజ్ఞానమ్ బ్రహ్మ” అన్నారు. ప్రకృష్టమైన జ్ఞానమేదో అది ప్రజ్ఞానం. అదే బ్రహ్మస్వరూపం. అది అద్వితీయం కూడా గనుక ఆనంద స్వరూపం కూడా. ఎంత ఆనందమది. ఎంత జ్ఞానమో అంత. ఎంతటిదా జ్ఞానం. ప్రకృష్టమైనది. అలాగే ప్రకృష్టమైన ఆనందమే కావాలి ఆనందం కూడా. ఆనందానికే హ్లాదమని పేరు. అది ఆహ్లాదం కావచ్చు. అనుహ్లాదం కావచ్చు. సంహ్లాదం కావచ్చు. అవన్నీ తగ్గు రకాలు. అన్నిటికన్నా నిరతిశయమైతే అది ప్రహ్లాదం, ప్రజ్ఞానమన్నట్టు అది ప్రహ్లాదం. "సేయమ్ ఆనందస్య మీమాంసా భవతి" అని తైత్తిరీయంలో ఆనంద మీమాంస జరుగుతుంది. మనుష్యానందం, గంధర్వానందం ఇలా ఆనందంలోని అంతస్తులు వింగడిస్తూ చివరకు వచ్చేది బ్రహ్మానందమని వర్ణిస్తుంది. దాని వివిధ శాఖలే తతిమా ఆనందాలన్నీ అని కూడా పేర్కొంటుంది. ప్రస్తుత మీ ప్రహ్లాద అనే పేరు ఆ బ్రహ్మానందాన్నే సూచిస్తున్నది. అదీ ఇందులో సంకేతం.
దీనికి వ్యతిరిక్తంగా హిరణ్యకశిపు అనే అతని తండ్రి నామధేయం భాసిస్తున్నది. కొడుకు ప్రహ్లాదుడైతే అతడు హిరణ్యకశిపుడు. ఏమిటి హిరణ్యకశిపుడంటే అర్థం. హిరణ్యమంటే బంగారు. కశిపు అంటే వస్త్రమనీ, ఆహారమనీ అర్ధం. బంగారమే కప్పుకొని తిరిగేవాడు. కబళించేవాడు. బంగారమేమిటి. ఐహిక భోగాలూ, ఐశ్వర్యాలు. ఇవే పరమార్థమని భావించేవాడే హిరణ్యకశిపుడు. అలా కాక సర్వాత్మకమైన శాశ్వతమైన ఆ బ్రహ్మాత్మ భావమే పరమార్ధమని ఎంచేవాడు ప్రహ్లాదుడు. ఒకటి ఐహికం. వేరొకటి ఆముష్మికం. చూడబోతే రెండూ రెండు ధ్రువాలు. వీటికెలా లంగ రందటం. అందుకనే ఆ హోరా హోరిగా జరిగిన పోరాటం.
మరి తండ్రి కొడుకుల మధ్య పోరాటమేమిటి. ఒకరి మతమొకరి కర్ధం గాకనా. అయికూడా మకురు తనమా. అర్థం కాదనటాని కాధారం లేదు. ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహాజ్ఞాని. అతనికి తండ్రి స్వభావం తెలియకపోదు. ఒకవేళ అతడు తన మతం కాదని త్రోసి పుచ్చినా, అదీ తనకు సమ్మతమేనని తదనుగుణంగా నడుచుకోగలడు. బ్రహ్మజ్ఞాని అసలలాగే నడవాలి కూడా. అలా నడిస్తే ఇక వివాదమే లేదు పోతే ఇక హిరణ్యకశిపుడి కేమీ తెలియదా అంటే అదీ అర్థం లేని మాటే. ఎందుకంటే అతడు గొప్ప వేదాంతి. సకల శాస్త్ర పారంగతుడూ, తపస్సంపన్నుడూ కావటమే గాక అధ్యాత్మ విద్యలో ఆరి తేరినవాడు. దీనికి నిదర్శనమొకటి
Page 327