#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

కూడా కాదు. గర్భంలో ఉండగా జరిగిన వృత్తాంతమది. అది ఇప్పుడెలా గుర్తుకు వచ్చిందా బాలుడికి. తండ్రి హిరణ్యకశిపుడు చెప్పాడా. అతడికా విషయమే తెలియదు. పైగా అతడి మతానికది విరుద్ధమైనది. కాబట్టి నారదుడు కూడా చెప్పి ఉండడాయనకా విషయం. పోనీ తల్లి లీలావతి చెప్పిందా. ఆవిడే పెద్దకాలం నాటి విషయమై మరచి పోయిందంటున్నాడు ప్రహ్లాదుడు. అలాంటప్పుడితని కెలా బోధిస్తుంది. పోతే ఇక నారదుడొకడే బయటపెట్టి ఉండాలతని కెప్పుడో ఒకప్పుడు. ఏదీ నారదుడా తరువాత ఎప్పుడుగానీ ప్రహ్లాదుణ్ణి కలుసుకొన్న సందర్భమే లేదు గదా. ఎలా బయట పెట్టటం. అంచేత దీనిని బట్టి చూస్తే ఎవరూ చెప్పకుండానే గర్భస్థ వృత్తాంత మా కుర్రవాడికి స్వయంగానే స్మరణకు వచ్చిందని తేట పడుతున్నది. అది ఆ కుర్రవాడే చెబుతున్నాడు. దైవయోగం చేత నాటి నుంచీ నాకది మరపు రాకుండా నిలిచి పోయిందని.

  ఇలాటి జన్మాంతర స్మృతి అతనికున్నదంటే అతడెంత మహా భాగవతుడో ఇక చెప్పనక్కరలేదు. ఇలాటి వాడొకడున్నాడు వామదేవుడనే మహర్షి. "గర్భస్థ ఏవ వామ దేవః ప్రతిపేదే అహమ్ మనుర భవమ్ - సూర్యోభవమితి" అని చాటుందుపనిషత్తు. తల్లి గర్భంలో ఉండగానే నేను మనువునయ్యాను. సూర్యుడ నయ్యానని కేక వేశాడట ఆయన. సర్వాత్మ భావసిద్ధి కలిగినవాడు గాని అలా ధైర్యంగా అనలేడు. అది పరిపూర్ణమైన నిర్గుణ బ్రహ్మాత్మజ్ఞానంవల్లనే గాని మానవుడికి లభించదు. “బహూనామ్ జన్మ నామంతే - జ్ఞానవాన్ మాం ప్రపద్యతే - వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః" ఎన్నో కోట్ల జన్మలయి ఏ జన్మకో చివర కిదంతా ఆ స్వరూపమే ననే అఖండ జ్ఞానం కలిగితే ఆజ్ఞానంతో గాని నా అసలైన రూపం పట్టుకోలేడు సాధకుడు. అలాటివాడే నిజమైన మహాత్ముడు లోకంలో. మరి అలాంటి మహాత్ముడు నూటికి కోటికొకడు కనిపిస్తాడో లేదో అని పరమాత్మ చాటుతున్నాడు లోకానికి. వామదేవాది మహాజ్ఞానుల కోవలోకి చేరిన అలాటి మహాత్ముడీ ప్రహ్లాదుడు. అతడిక జన్మించి సాధించవలసింది ఏదీ లేదు. జన్మించటమే సిద్ధుడుగా జన్మించాడు.

  ఆహ్లాద సంహ్లాదానుహ్లాద ప్రహ్లాదులని అసలు హిరణ్యకశిపుడికి నలుగురు కుమారులు. అందులో ఆ మొదటి ముగ్గురికీ ఊరు పేరు లేదు. నాలుగవవాడే నాణెమైనవాడు. ప్రహ్లాదుడని పేరు పెట్టటంలోనే అవగతమవుతుంది మనకది.

Page 326

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు