#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

12. నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

కడచిన అధ్యాయంలో మనం సగుణ నిర్గుణ సంధిని గురించి వర్ణించాము. దాని కుదాహరణ ప్రాయమైన గజేంద్రమోక్షణ కథా వృత్తాంతాన్ని కూడా విపులంగా ప్రస్తావించాము. ఇంద్ర ద్యుమ్నుడి జీవితం సగుణంతో గడచిపోతే అది నిర్గుణంగా మారి ముక్తి పొందటానికా భక్తుడు మరలా గజేంద్ర జన్మ ఎత్తవలసి వచ్చింది. ఎత్తిన తరువాత కూడా వెంటనే పని చేయలేదా ప్రాక్తనసంస్కారం. అది ఉద్బుద్ధం కావటానికి కొంతకాలం పట్టిందా గజేంద్రుడికి. పోతే అలాంటి విలంబం కూడా లేక పుట్టగానే నిర్గుణ భావంతో పుట్టిన మహాజ్ఞాని చరిత్ర ఇప్పుడు చెప్పుకోవలసి ఉంది. అదే ప్రహ్లాదుడి చరిత్ర. పుట్టగానే కాదు. ఆ మాటకు వస్తే మాతృగర్భంలో ఉండగానే కలిగిందా భావమా మహనీయుడికి.

  ప్రహ్లాదుడే చెబుతాడీ విషయం తన తోడి బాలురకు. వారు నీకీ గొప్ప బుద్ది ఎలా అలవడిందని ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు వారితో ఇలా అంటాడు. ఇలా అంటాడని నారద మహర్షి రాజసూయ యాగంలో ధర్మరాజుకు చెప్పిన వృత్తాంతమిది.

మ్ దైత్య సుతైః పృష్టో - మహాభాగవతో 2 సురః ఉవాచ స్మయ మానస్తాన్ - స్మర న్మదను భాషితమ్

  వారడిగిన ప్రశ్నకు నవ్వుతూ మహా భాగవతుడైన ప్రహ్లాద కుమారుడు నా మాటలన్నీ స్మరణకు వచ్చి ఇలా సమాధానమిచ్చాడంటాడు నారదుడు.

పితరి ప్రస్థితే 2 స్మాకమ్ తపసే మందరా చలమ్ యుద్ధోద్యమమ్ తదా చక్రు ర్విబుధా దానవాన్ ప్రతి

  మా తండ్రి హిరణ్యకశిపుడు తపస్సు కోసం మందర పర్వత సమీపానికి వెళ్లగా సందు చూచి సకలదేవతలూ రాక్షసుల మీదికి దండెత్తి వచ్చారు. “ఇంద్రస్తు రాజ మహిషీమ్ - మాతరం మమ చాగ్రహీత్" అప్పుడు దేవేంద్రుడు మా తల్లి లీలావతిని బలాత్కారంగా పట్టుకొని పోసాగాడు. “నీయమానామ్ భయోద్విగ్నామ్ క్రందం తీం కురరీమివ" సమయాని కాదరిని పోతూ ఉన్న నారద మహర్షి

Page 324

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు