దానికీ గజేంద్రయోనిలో వచ్చి మరల ఒక జన్మ ఎత్తవలసిన అగత్యమేమిటి. మరలా జన్మించాడంటేనే అప్పటికా జన్మలో అంతటి పరిపాకం రాలేదన్న మాట. మోక్షఫలాన్ని అందుకోదగిన పరిపాకమప్పుడు కలగలేదు. అది సాధించటానికే మరొక జన్మ కావలసి వచ్చింది. ఇది జడ భరతుడికి లేడి జన్మలాంటిది. అది తీరగానే అతడికి మరు జన్మలో జీవన్ముక్తి ఎలా లభించిందో అలాగే ఇంద్రద్యుమ్నుడికి కూడా గజజన్మ సాధన పరిసమాప్తి కోసం ప్రాప్తించింది. అది ఆలంబనంగా సాధన పూర్తి చేసుకొని పరిపూర్ణ జ్ఞాననిష్ఠుడయి చివరకా గజోపాధిని కూడా కాలదన్ని అశరీరమైన మోక్షసుఖాన్నే అందుకొన్నాడు. దానికీ మకర గ్రహణమూ, ఈ దుఃఖానుభవమూ, భగవదనుగ్రహమూ, విష్ణు సారూప్యమూ, ఇవన్నీ సహకారులు. మొత్తానికి సగుణ సాధన అనేది ఎలా పరిమితమో, అది నిర్గుణ సాధనగా పరిణమించినప్పుడే ఎలా ఫలదాయకమో, మనకు బోధించటమే ఈ కథా తాత్పర్యం. అందుకోసం చేసిన ఒక బృహత్కల్పనే ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతం. నిజానికి గజేంద్రుడూ లేడు. గ్రాహమూ లేదు. మానవుడి దేహాభిమానమే గజం. తన్మూలంగా ఏర్పడిన సంసార క్లేశమే గ్రాహం. పరిచ్ఛిన్నమైన ఆ అభిమానం వదిలేస్తే ఈ సంసార తాపత్రయమే లేదు. అప్పుడు వీడే ఈశ్వరుడు కాబట్టి సగుణ దృష్టి లేదు. అదే మోక్షం. అసలైన గజేంద్ర మోక్షం.
Page 323