సగుణం కాదు. కేవల నిర్గుణమైన మార్గంలోనిది. వాసుదేవ స్సర్వమితి అని సర్వమూ ఈశ్వరమయంగానే భావిస్తున్నాడిపుడు. పరిపూర్ణమైన జ్ఞాననిష్ఠ ఇది. ఇలాంటి ఉత్తమాధికారికి భగవానుడివ్వవలసింది కేవలం మోక్షమే. అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని గదా హామీ ఇచ్చాడు. అదే ఇచ్చాడనుకోవాలి ఇప్పుడు.
తమముం బాసిన రోహిణీ విభు క్రియన్ దర్పించి సంసార దుః ఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా దము లల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పె
నని వర్ణించటంలో కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నాడు. భాగవతకారుడు.
అయితే మరి హస్తిలోకనాథుడజ్ఞాన రహితుడై విష్ణు రూపుడగుచు వెలుగుచుండె అని వర్ణించాడే కవి. మూలంలో కూడా
"గజేంద్రో భగవతః స్పర్శా - ద్విముక్తో ఽ జ్ఞాన బంధనాత్ ప్రాప్తో భగవతో రూపమ్ పీత వాసా శ్చతుర్భుజః”
అని ఉంది. ఈ వర్ణన చూస్తే అతనికి విష్ణు సారూప్యమే వచ్చినట్టు కనిపిస్తున్నది. మోక్షం లభించినట్టు లేదని ఆశంకించవచ్చు. విష్ణు సారూప్యమనేది విభూతి ప్రాధాన్యాన్ని బట్టి చెప్పిన మాటే గాని మరేమీ గాదు. విష్ణువంటే కూడా ఇక్కడ కేవల శబ్ద స్వరూపాన్ని బట్టి మోసపోరాదు. విష్ణువంటే ఎవరో ఏమిటో ఇంతకు ముందే నిరూపించి ఉన్నాము. మ పూరుషుడొక్కడాద్యుడు పాలనోద్భవ నాశముల్ సొరిది జేయ ముకుంద పద్మజ శూలి సంజ్ఞల” దాల్చాడని వర్ణించారే ఆ పరమ పురుషుడే ఇక్కడ విష్ణువు. ఈ విషయం తరువాత ప్రహ్లాద చరిత్రలో ఇంకా సవిస్తరంగా మనవి చేస్తాను. ఇంతకూ విష్ణువంటే సర్వవ్యాపకమైన తత్త్వం. అలాంటి తత్త్వంతో ఐక్యం చెందటానికే గదా అతడు గజేంద్రుడుగా జన్మించింది. అలా కాక కేవల విష్ణుత్వమే చెంది వికుంఠంలోనే వసించటానికైతే అది ఇంద్రద్యుమ్నుడి జన్మలోనే పొంది ఉండేవాడు. పరమ వైష్ణవుడు గదా అతడు. యం యం వాపి స్మరన్ భావమన్నట్టు ఆ భావంతోనే ప్రాణోత్రమణమయి అది అప్రయత్నంగానే గడించేవాడు
Page 322