తర ధమ్మిల్లము చక్క నొత్తడు వివాద ప్రోద్ధృత శ్రీకుచో పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ నోత్సాహియై”
ఆ గజప్రాణాలు కాపాడుదామనే సంరంభంలో ఆయన అన్నీ మరచిపోయాడు. సిరితో ఒక్కమాటైనా చెప్పలేదు. శంఖచక్రాది దివ్యాయుధాలు చేపట్టలేదు. పరివారాన్ని పరికించలేదు. వాహనమైన గరుడాళ్వారును గూడా పాటించలేదు. మరే కథాలేదు. అంతా మరచాడు. మరచాడా నిజంగా. పరిపూర్ణ చేతనుడైన పరమాత్మ ఏమిటి. మరవటమేమిటి. అసహాయ శూరుడు పరమాత్మ అని చెప్పటమే ఇందలి అభిప్రాయం. పరమాత్మ అంటే అది అద్వితీయమైన తత్త్వం గదా. అద్వితీయ మన్నప్పుడు సర్వశక్తులూ దానికే ఉన్నాయి. అది సర్వస్వతంత్రం. అనన్యాపేక్షం. అలాంటి భగవత్తత్త్వానికి మరొక దాని సహాయమేమిటి. అసలుంటే గదా మరొక పదార్థమనేది.
అయితే చమత్కారమేమంటే మరొకటేదీ వాస్తవంలో లేకపోయినా దాని మాయాశక్తి చేత దాని కన్నీ సంపన్నమే. నిత్యసిద్ధమే. సంకల్ప మాత్రం చేతనే ఆయన కవి సిద్ధిస్తాయి. చేతికి వస్తాయి. కనుకనే
తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ – దానివె న్కను బక్షీంద్రుడు - వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ క్ర నికాయంబును - నారదుండు - ధ్వజినీ కాంతుండు - తావచ్చి రొ య్యన వైకుంఠ పురంబునం గలుగు వా రాబాల గోపాలమున్
ఇందిరా కాంత ఏమి మిగతా అంతః పురాంగనలేమి విహంగ మాధిపతి ఏమి, విష్వక్సేనుడేమి, శంఖ చక్రాది పరికరాలేమి, సర్వమూ ఆయన సంకల్పాను సారియై తరలి వచ్చింది. ఏమిటాయన సంకల్పమింతకూ. గజ ప్రాణావనం. అది ఎప్పుడా దివ్య చిత్తానికి తగిలిందో అప్పుడే అవన్నీ సన్నిధి చేశాయి. "ఇచ్ఛా మాత్రమ్ ప్రభోః సృష్టిః" అనేది ఇదే. యోగీశ్వరులైన వారే సంకల్ప మాత్రంచేత ఆయా అద్భుతాలు సృష్టిస్తుంటే యోగీశ్వరేశ్వరుడైన భగవానుడి కది చెప్పేదేముంది. సర్వజ్ఞుడూ సర్వశక్తి సంపన్నుడూ ఆయన. ఎటు వచ్చి అది ఆయా జీవుల సుకృత కర్మ పరిపాకం కొద్దీ ప్రాదుర్భవిస్తుంది. గజేంద్రుడి కర్మ ఇప్పుడీ క్షణానికి పాకానికి వచ్చింది. కనుకనే ఈక్షణగోచరుడయ్యాడు పరమాత్మ తనమందీ మార్బలంతో గూడా.
Page 319