విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని - విశ్వవేద్యు - విశ్వు నవిశ్వున్ శాశ్వతు - నజు – బ్రహ్మ ప్రభు నీశ్వరునింబరమపురుషు నే భజియింతున్
ఎవ్వనిచే జనించు అనే పద్యంలాగా సమస్త శాస్త్రసార సంగ్రహమిది. అంతేకాదు. కేవల శాస్త్రార్ధమే గాకఅపరోక్షమైన దాని అనుభవం కూడా పొందుపడి ఉన్నదిందులో. విశ్వకరుడట ఆ పరమాత్మ. విశ్వమనే పదార్ధాన్ని తయారుచేసిన వాడు. విశ్వదూరుని. తయారుచేసి తయారయిన ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. ఒక కుమ్మరిఉన్నాడు. కుండ ఉన్నది. కుండను కుమ్మరే తయారుచేస్తాడు. చేసినా ఆ చేసిన కుండలో లేడా కుమ్మరి. దానికి దూరంగానే ఉంటాడు. అలాగే ప్రపంచాన్ని సృష్టించినా ఈ సృష్టికి అతీతంగానే ఉన్నాడా స్రష్ట అయితే అంత అతీతంగా దూరంగా ఉండిపోతే ఎలాగ. అది అసలు ఉందో లేదో మనకు తెలియదు. కుమ్మరి విషయ మంటే అది వేరు. కుండతో అవినాభావంగా లేకపోయినా దానికి బాహ్యంగానైనా ఎక్కడో ఒకచోట లోకంలో కనిపిస్తున్నాడు. కనుక నమ్మకం మనకు వాడున్నాడని. ఇక్కడ అలా కాదు. సృష్టించి మన ముందు పారేసి తానెక్కడో ఉన్నాడని చెబుతున్నారు. చెబుతున్నారే గాని మనం చూడటం లేదు గదా. ఏమిటి నమ్మకమని ప్రశ్న వస్తుంది. అందుకే విశ్వాత్ముని, విశ్వానికంతా ఆత్మ. అంటే స్వరూపమాయన. కుండకు కుమ్మరి నిమిత్తమైతే మట్టి అనేది స్వరూపం. కుమ్మరి దూరంగా ఉన్నా మట్టి అలా దూరం కావటానికి వీలులేదు. ఎందుకంటే అది దాని స్వరూపమే అయి కూచుంది. ఎలా దూరమవుతుంది. అలాగే ప్రస్తుతం ఈ సృష్టించిన విశ్వానికంతా ఆయన కుమ్మరిలాగా కేవల నిమిత్త కారణమే గాదు. మట్టిలాగా స్వరూపం కూడా. అంటే ఆ ఈశ్వర చైతన్యమే ప్రపంచాకారంగా భాసిస్తున్నది. అంచేత ఎంత దూరమో అంత దగ్గర ఆ పరమాత్మ దీనికి. నిమిత్తంగా దూరమనుకొంటే ఉపాదానంగా మరలా దగ్గరే. దగ్గరంటే లోపలా వెలపలా మధ్యలో సర్వత్రా ఆ స్వరూపమేనని అర్థం. పోతే విశ్వవేద్యు. అంత కలగా పులగంగా వ్యాపించి ఉన్నా అది మనకీ విశ్వంలో ఎందుకు కనపడటం లేదని మరలా సందేహం. మట్టిలాగా దానికొక నిర్దిష్టమైన రూపంలేదు. శుద్ధచైతన్యమది. అందుకే కనపడటం లేదు. మరి కనపడకపోతే ముక్తి లేదా మానవుడికి. అంచేత కుండను బట్టి దానిలో ఉన్న మట్టిని పోల్చుకొన్నట్టే ఈ ప్రపంచాన్ని ఆధారం చేసుకొనే దానిలో దాగి ఉన్న ఆ తత్త్వాన్ని పట్టుకోవాలి మనం
Page 316