#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

  మరి అలాటి పరమాత్మ ఒకడున్నాడా. అనుమానం కలిగింది మరలా గజేంద్రుడికి దేహమనే ఉపాధి ఒకటున్నంత వరకూ దాని చెహరా అది చూపుతూనే ఉంటుంది. ఎంత జ్ఞానికైనా అప్పుడప్పుడు మనో నిబ్బరం దెబ్బ తింటుంది. దాని ప్రభావమలాంటిది. ఆ దెబ్బే తగిలిందిప్పుడు గజేంద్రుడికి కూడా. ఉన్నట్టుండి అనుమాన పిశాచ మావరించిం దతణ్ణి.

కలడందురు దీనుల యెడ కలడందురు పరమయోగి గణముల పాలం గలడందు రన్ని దిశలను కలడు కలం డనెడు వాడు కలడో లేడో

  అసలు వాడున్నాడా లేడా ఉంటే అన్నీ తెలిసిన యోగుల దగ్గర ఎలాగో ఏమీ తెలియని దీనులదగ్గర కూడా ఉండాలి గదా. అసలీ యోగులేమిటి. దీనులేమిటి. సమస్త దిక్కులలో కూడా పిక్కటిల్లి ఉన్న తత్త్వమని గదా వర్ణించారు పెద్దలు. మరి ఎందుకు నన్నాదుకోడు. అని ప్రశ్న వచ్చింది. దీనితో మనసు కుంగింది. అధైర్యంతో గుండె దిగజారింది. తన శరీర బాధ మరలా తనకు జ్ఞాపకం వచ్చింది. దానితో మరలా దీనాలాపాలు చేయసాగాడు.

కలుగడే నా పాలి కలిమి సందేహింప - కలిమి లేములు లేక కలుగువాడు నా కడ్డ పడరాడె నలిన సాధువులచే - బడిన సాధుల కడ్డపడెడు వాడు చూడడే నా పాటు చూపుల జూడక - చూచు వారల గృప జూచువాడు లీలతో నా మొఱ్ఱాలింపడే మెఱగుల మొఱలెఱుంగుచుదన్ను మొఱగువాడు

  అకించనులకూ ఆర్తులకూ అడ్డపడవలసిన వాడే. అయినా పడలేదంటే అది ఒక మోసం. అది ఆ పరమాత్మ స్వభావంలోనే ఉంది. ఆయన చూపులతో చూడకుండా చూచేవారినే చూస్తాడు. మొఱ పెట్టే వారి మొఱ లెఱుంగటానికే తన్ను మఱుగుపరుస్తాడు. అయినా అఖిల రూపాలూ తన రూపమైన వాడే గదా. పైగా భక్త జనముల దీనుల పాలివాడే గదా. వినకపోతాడా. చూడకపోతాడా. రాకపోతాడా.

  ఏమో వస్తాడో లేదో - అని భయపడటానికాయన ఎక్కడ ఉన్నాడని ఇంతకూ మరలా పూర్వ సంస్కారం తళుక్కున్న మెఱసి జ్ఞానోదయమయింది గజేంద్రుడికి. దానితో ఇలా వర్ణిస్తున్నాడు.

Page 315

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు