ఏమిటి తరణోపాయం. ఒరులనే భావాన్ని మరచి అది నేనే గదా అని ఎఱిగినప్పుడే అది కరతలా మలకం.
ఎవరయినా ఉన్నారా అలాంటి ఎఱుక గలవారు. అయ్యో లేకేమి. మనుష్యాణాం సహస్రేషు అన్నట్టు అంత బహుళంగా కాకపోయినా విరళంగా నైనా దొరకక పోరు. వారే ముక్త సంగులైన మునులు. వారెప్పుడూ దిదృక్షులే. సర్వభూత హితత్వం, శాంత చిత్తత్వం ఇలాంటి దైవగుణ సంపన్నులు. దానికి తోడు అసదృశ వ్రతాఢ్యులు కూడా. యమ పట్టుదల వారికి. అలాంటి వారికి తప్పకుండా కనపడుతుందా దివ్యమైన పదం. “దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా” అని గదా శాస్త్ర ప్రమాణం. మాటలతో ఎఱుకలతో మనసులతో చేరరానిదే కావచ్చునది. అయినప్పటికీ సత్యమే. జీవిత గమ్యంగా భావించి నిపుణంగా తరచి చూచే నిష్కర్ముడికది ఎప్పుడూ చేరువే. ఇంతకూ రహస్య మేమంటే అసత్యమనెడి నీడతో వెలుగుతున్నదది. అసత్యమెప్పుడూ అసత్యమే కాబట్టి దానితో వెలుగుతున్నా అది ఎప్పుడూ ఒక్కటి. మరి అసత్తత్త్వంతో కలిసి ఉన్న నేరానికి సకారణమైతే, స్వరూపతః నిష్కారణమయి కూచున్నది.
మరి ఈ రెండు మాటలలో దాగి ఉన్న రహస్యం తెలిసిన వారే యోగాగ్ని దగ్ధ కర్ములైన యోగీశ్వరులు. వారే మహాత్ము లీసృష్టిలో. సద్యోగమంటే సమ్యగ్దర్శనమనే యోగంతో విభాసితమైనవి వారి మనసులు. అలాంటి మసృణీ భూతమైన మనో దర్పణాలలో చక్కగా ప్రతిఫలించిన ఆ ఆత్మతత్త్వాన్ని వారు నిరంతరమూ దర్శిస్తూనే ఉంటారు. ఇలా అనుకొంటూ ఉండగానే గజేంద్రుడికి తనపాశవమైన ఉపాధి మనసుకు వచ్చింది. ఉపాధి లక్షణమెక్కడికి పోతుంది. అది జ్ఞాపకం రాగానే మొరపెడుతున్నాడు. “మాదృక్రపన్న పశుపాశ విమోక్షణాయ-ముక్తాయ భూరి కరుణాయ నమో ఽ కలాయ” అని. అంతేకాదు. "ఆత్మాత్మ జాప్త గృహవిత్త జనేషు సక్షైఃదుష్పా పణాయ గుణ సంగ వివర్జితాయ” శరీరబంధు మిత్ర పుత్ర కళత్ర విత్త గృహ క్షేత్రాదులలో సదా సక్తులమైన పశుబుద్ధి మాది. అలాటి బుద్ధిగల మాబోటి పశువుల కందరాని పదం నీది. ఎప్పటికైనా నీ వనుగ్రహించి ఈ పశుపాశ విమోక్షణం చేస్తేనే మాకు మోక్షమని వాపోతాడు. గజేంద్రుడు కోరిన మోక్షణమప్పటికీ సంసార పాశమోక్షణమే మరేదీగాదు.
Page 314