#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన - తుది నలోకంబగు పెం జీకటి - కవ్వల నెవ్వం డేకాకృతి వెలుగునతని నే సేవింతున్

  పెంజీకటి కవ్వల ఉండే వెలుగా పరమాత్మ. వెలుగనేది ఒక్కటే. మిగతాదంతా ఇక చీకటి. చీకటి వెలుగు కంటే భిన్నంగా కనిపిస్తుంది. కాని వాస్తవంలో కాదు. అది కూడా వెలుగే. అప్పుడిక చీకటి వెలుగులనే ద్వంద్వం లేదు అంతా వెలుగే. అదే ఏకాకృతి అంటే. ఎటు వచ్చీ ఈ చీకటి కూడా వెలుగుగా చూడగలగాలి. ఏమిటి చీకటి అంటే ఇక్కడ. ఈ లోకాలూ, లోకాధిపతులైన దేవతలూ, ఆ లోకాలలో నివసించే జీవులూ. ఇవన్నీ వాస్తవంలో లేవు. అంతా హుళుక్కే వ్యక్తమైన ఈ ప్రపంచమంతా అవ్యక్తమైన బీజశక్తే. అందుకని ఇదితెగితే చివరకు నిలిచేది అదే. అది కూడా శక్తిమంతుడైన పరమాత్మతో ఓతప్రోతమై దానికన్నా విలక్షణం కాదు గనుక అంతా ఏకమే. పరమాత్మే. అయితే ఇది పరమాత్మ కెప్పుడూ ఎఱుకే. మనబోటి జీవాత్మల కలాటి ఎఱుకలేదు. దాన్ని మరలా అలవరుచుకోగలిగితే చాలు-మనమంతా ఈ సృష్టికి సాక్షి భూతంగా అకలంకంగా నిలువగలం.

  అసలీ పరమాత్మ జీవాత్మ అని పేరేగాని రెండు తత్త్వాలు లేవు వాస్తవానికి. అంతా చైతన్యమే అయినప్పుడవి రెండెలా కాగలవు. రెండాకాశాలుండట మనేది సంభవం కానట్టే రెండు చైతన్యాలు కూడా లేవు. మరి ఎలా వచ్చిందీ జీవేశ్వర వ్యవహారం. అది ఆ మహాచైతన్య లీల.

నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు - మునులు దివిజులుం గీర్తింపనేర - రెవ్వని వర్తన మొరులెఱుగ రట్టివాని నుతింతున్

  ఒక వేషగా డెలాగైతే రాజు, రైతు, దొంగ, దొర, రకరకాల వేషాలు వేసుకొని రంగ స్థలం మీద నటిస్తూ మనకు దిగ్రమ గొలుపుతాడో అలాగే మహానటుడైన ఆ పరమాత్మ కూడా మృగ పశుపక్షి మనుష్యాధికమైన భిన్న భిన్న నేపధ్యాలలో మనకు భిన్నంగా గోచరిస్తున్నాడు. ఆ భూమికలనే మనం జీవుడని పేరు పెట్టి చూస్తున్నాము. నిజానికి భూమికలే లేవు. అవన్నీ ఆయనవే. ఆ ఒక్కడే పెక్కురీతులుగా కనిపిస్తున్నాడు. అంత మాత్రమే. ఈ నానాత్వంలో ఆ ఏకత్వాన్ని దర్శించగలవాడే ధన్యుడు. అది దేవతలకూ ఋషులకే అగమ్య గోచరం. అది ఒరులెఱిగే విషయం కాదు. మరి

Page 313

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు