తనకు తానే ప్రమాణమని అర్థం. మరొకటుంటే గదా ఎక్కడ అనే ప్రశ్న. ఆధారమూ అదే. ఆధేయమూ అదే. ఇక ఎక్కడ అనే ప్రశ్న ఏముంది. స్వమహిమ్ని ప్రతిష్ఠితమది. అలాంటి ఈశ్వరుణ్ణి భజిస్తానంటాడు గజేంద్రుడు. ఎంత గొప్ప భావమిది. వేదాంత శాస్త్ర ప్రమేయమంతా ఒక్కచోట రంగరించి పెట్టిన చక్కని పద్యమిది.
సరే ! బాగానే ఉంది. అయితే సకలమూ ఆ ఈశ్వరుడే గదా. అలాంటప్పుడీ ప్రపంచ సృష్టి ఏమిటి. ఇందులో మనం పుట్టటం పెరగటమేమిటి. ఈ బాధలు పడటమేమిటి. దానికి సమాధానమిస్తున్నాడు. "ఒక పరిజగములు వెలినిడి – ఒక పరిలోపలికి గొనుచు" వాస్తవమే. అంతా ఆ ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుడు గనుకనే ఆయన కొక లోకోత్తర శక్తి ఉన్నది. తన్నిమిత్తంగా అతడీ బ్రహ్మాండ భాండాలనన్నింటినీ తన స్వరూపంలో నుంచే బయట పెడతాడు. కొంత కాలమలా నిలుపుతాడు. మరలా వీటన్నిటినీ తన లోపలికే తీసుకొంటాడు. ఒక మహాసముద్రం లాంటి వాడాయన. సముద్రం తనలో నుంచే తరంగ ఫేన బుద్బుదాలను వేలకు వేలు సృజిస్తుంది. తనమీదనే త్రిప్పుతుంటుంది. అలా త్రిప్పినట్టే త్రిప్పి మరలా కొంత సేపటికి వాటినన్నిటినీ తన గర్భంలోనే ఇముడ్చుకొంటుంది. అలాగే ఇక్కడా. అయితే ఈ సమస్త లోకాలనూ వెలినిడుతూ లోగొంటూ పోతే ఆయనకూ ద్వంద్వ బాధ తప్పదు గదా-అంటే అలాంటి బాధ ఏదీ లేదా పరమాత్మకు. ఏమి కారణం. ఆయన సకలార్ధ సాక్షి. అకలంకుడు. వెలినిడినప్పుడీ సమస్త సృష్టికీ సాక్షి ఆయన. కాబట్టి దాని పీడ ఆయన నంటదు. లో గొన్నప్పుడా ప్రపంచమనే కళంకమిక లేనే లేదు. కాబట్టి ఆ పాటి పీడ కూడా కలగబోదు.
ఆయన కంటే సరే. ముక్త సంగుడు. అద్వితీయుడు. సర్వశక్తుడు. మరి మన బోటి జీవుల గతి ఏమిటి. మనకంతటి సామర్థ్యం లేదు గదా. వాస్తవమే. లేనట్టే కనిపిస్తుంది మనకలాటి సామర్ధ్యం. కాని ఇది వ్యావహారికమే. పారమార్థికంగా మాటాడితే మనకూ ఆ ఈశ్వరుడికి భేదం లేదు. ఈశ్వరుడద్వితీయు డన్నప్పుడిక మనమనే జీవులమెక్కడున్నాము. అర్ధం చేసుకోలేకనే మనమెక్కడో ఉన్నట్టు అజ్ఞులమూ అశక్తుల మయినట్టు భాసిస్తున్నాము. చక్కగా అర్ధం చేసుకొంటే మనమూ ఆయనలాగా అసక్తులమే. శక్తులమే. అది ఎలాగంటే చెబుతున్నాడు.
Page 312