#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

పరిణమిస్తుంది. ఆవరణ భంగమైతే గాని మోక్షానికి నోచుకోలేము. అది ఈ గజశరీరం నుంచి మోక్షణమే.

  అప్పటికి గజేంద్రమోక్షమంటే ఏమిటో అర్థం చెప్పినట్టయింది. ఒక మొసలి పట్టు నుంచి విడిపించటం కాదు గజేంద్రమోక్షణ మంటే. నిజమైన మోక్షణం గజ జన్మ నుంచి. ఇదే గజేంద్ర మోక్షణం. గజేంద్రుడు కోరిందీ అదే దేవుడు ప్రసాదించిందీ అదే. అలాంటి మోక్షణం సాధించాలే గాని అందులో ఈ మొసలి దాని కాలు పట్టుకోటమెంత. దాని నుంచి విడిపించుకొని బయట పడటమెంత. అది ఏపాటి. అప్రయత్నంగా సిద్ధించే వ్యవహారమది దాని కోసం పృథక్ర్ప యత్నమక్కరలేదు. అహంకారం తొలగితే అన్నీ వాటిపాటికవే తొలగిపోతాయి. దానితో ఇక గ్రాహమూ లేదు. పట్టుకోటమూ లేదు. బాధ పడటమూ లేదు. మొత్తం గజేంద్ర మోక్షణ సంకేతమంతా ఈ శ్లోకం ద్వారా వ్యంగ్యంగా మనకు భాసింపజేశాడు మహాముని.

  ఇలాంటి గొప్ప ఊహ జనించిందంటే గజేంద్రుడి కది ఎంత పూర్వ పుణ్యఫలం. కరీంద్రోత్తమ యోని బుట్టు మని గదా ఆశీర్వదించాడు మహర్షి. అందుకే కరీంద్ర జన్మ ఎత్తినా ఉత్తమమైన సంస్కారమెక్కడికీ పోలేదా రాజుకు. దానికి తగిన ఉన్నతోన్నతమైన భావాలే ఉదయిస్తున్నాయి మనసులో. అవన్నీ పూర్వ పుణ్య ఫలంగా కలిగిన దివ్యజ్ఞాన సంపత్తి నుంచి వెలువడిన జ్ఞానకిరణాలు. ఇలాంటి దివ్యమైన జ్ఞానమంతకు ముందు జన్మలో లేదు. అది సగుణభావనతోనే గడచిపోయింది. కనుక ఇంత దివ్యభావన లేదక్కడ. పోతే ఇది దాని ఫలితంగా నిర్గుణ మార్గంలో అడుగు పెట్టిన జన్మ. కనుక దీనికి తగిన దివ్యమైన ఆలోచనలే కలుగుతున్నాయి ఇప్పుడు. ఎలాటివా ఆలోచనలంటే ఇక ఎంతగానో వర్ణించి చెబుతున్నది భాగవతం.

ఏ రూపంబున దీని గెల్తునిట మీదే వేల్పు జింతించు – నె వ్వారింజీరుదు - నెవ్వరడ్డమిక - నివ్వారి ప్రచారోత్తమున్ వారిం పందగు వారలెవ్వ - రఖిల వ్యాపార పారాయణుల్

  లేరే మ్రొక్కద....నని తొలుదొల్త భయపడి దీనాలాపాలు చేస్తుంది. దిక్కుమాలిన తన మొఱ ఆలకించే పుణ్యాత్ములెవ్వరూ లేరా అని ఆక్రందన చేస్తుంది. ప్రాణోపద్రవం సంభవించినప్పుడు దేహధారి అయిన వాడికెవడికైనా ఇది సహజమే. తప్పదు

Page 309

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు