#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

శాపం. కోపం వచ్చిన వాడింత డొంక తిరుగుడుగా ఇంత మెలిక పెట్టి మాటాడడు. ఏదో ఒక ఏనుగువో, పీనుగువో అయి పొమ్మని తిట్టి వెళ్లిపోయేవాడు. అలా కాదిక్కడ. కరిగాదు. కరీంద్రుడుగా పుట్టమన్నాడు. అందులోనూ అధమం గాదు. మధ్యమంగాదు. ఉత్తమమైన గజంగానే జన్మించమన్నాడు. అందులో కూడా గజంగా కాదు. గజయోనిలో. అంటే అర్థం. గజ శరీరమనేది నీకొక ఉపాధిగా మాత్రమే ఏర్పడుతుంది గాని ఆ ఉపాధిలో ఉపహితమై ఉన్న పూర్వ సంస్కారమెక్కడికీ పోదు. అది ఎప్పటికైనా ఉద్భుద్ధమై మరలా నిన్ను కాపాడుతుంది సుమా. ఇంతలోతైన భావమిమిడి ఉంది ఇందులో.

  కనుకనే ఆ ఇంద్రద్యుమ్న జన్మలో పోగుచేసుకొన్న ప్రాక్తన పుణ్య సంస్కార మెక్కడికీ పోలేదు. గజేంద్రుడుగా జన్మించినా అది కొంత కాలానికి ఫలితమిచ్చింది. అదే పూర్వ పుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి అని పేర్కొనటం. శాస్త్రమే మనకిస్తున్నదీ హామీ. “తత్ర తం బుద్ధి సంయోగమ్ - లభతే పౌర్వ దైహికమ్” ఇంతకుముందు జన్మలో చేసుకొన్నదెక్కడికీ పోదు. మంచిగాని, చెడ్డగాని అది ఒక కూడబెట్టిన ధనం లాంటిది. మన సొమ్మే పొమ్మన్నది. అదైనా ఎందుకు మనకు ప్రాప్తించటమంటే “యతతేచ తతో భూయ స్సంసిద్ధా కురునందన" మరలా ఇతోధికంగా ప్రయత్నం చేసి చివరకు సాయుజ్య ఫలాన్ని చవిచూడటానికే నన్నారు. అలాగే ఈ గజేంద్రుడికి కూడా ఆ పూర్వజన్మ పుణ్యఫలంగా ఇన్నాళ్లకు జ్ఞానోదయమయింది. పుట్టగానే రావచ్చు గదా. ఇంత కాలమెందుకు పట్టిందని మరలా ఆశ్చర్యపడరాదు. ఫలించే సామగ్రి తయారుగా ఉన్నా కాలమూ కర్మమూ కలిసి వస్తే గాని అది ఫలించదు. కాల కర్మలనేవి దానికి నిమిత్తం. అలాటి నిమిత్తమిన్నాళ్లూ రాలేదా గజేంద్రుడికి. అందుకే గజేంద్రుడి పూర్వ జీవితమంతా పైలా పచ్చీసుగానే గడచిపోయింది. అలా పైలాపచ్చీసుగా వర్ణించటంలో కవి ఉద్దేశం కూడా ఇదే. అంతవరకూ నిమిత్త మేర్పడలేదు. అది ఆవిలాసమయ జీవితంలో తాత్కాలికంగా మరుగుపడి పోయింది. పోతే ఇప్పుడేర్పడింది ఆ నిమిత్తం. అదే దానికి జలావగాహం చేయాలని బుద్ధి పుట్టటం. హ్రదంలో ప్రవేశించటం. వెంటనే ఆ గ్రాహం వచ్చి కాలు పట్టుకోటం.

  గ్రాహమనేది ఇంతకూ ఒక నిమిత్తమే. నిమిత్తం గనుకనే "గ్రాహేణ పాశేన విధాతురావృతః అపారయ న్నాత్మ విమోక్షణే చిరమ్” అని మొరపెడతాడు

Page 307

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు