మోహం తమస్సని అర్థం. లుబ్ధ అంటే లోభం. రాగం. అంటే రజస్సని అర్ధం. రజస్తమో గుణాలున్న వాడవని భావం. రజస్తమస్సులే ఆత్మ చైతన్యానికావరణ విక్షేప దోషాలు. వీటివల్ల ఆత్మ అనేది సాధకుడి స్వరూపమే అయినా ఆవరణం చేత అది సంకుచితమయి విక్షేపం చేత అది మనకు భిన్నంగా ఎక్కడో భాసిస్తుంది. అదే తనకొక ఇష్టదైవత మవుతుంది. అది శివుడు కావచ్చు. విష్ణువు గావచ్చు. ఏదైనా గావచ్చు. విష్ణువుగానే గోచరించింది ఆయనకు. దానినే ధ్యానిస్తూ కూచున్నాడతడు. అది కూడా ధ్యాత అయిన తనకు భిన్నంగానే. మరి ఆ ధ్యేయమైన విష్ణుమూర్తికి భిన్నంగా తానే కాదు. ఈ బాహ్యప్రపంచం కూడా దానికి భిన్నంగానే తోచిందా రాజుకు. కనుకనే ప్రాదేశమాత్రమైన ఆ స్వరూపంలోనే మనసు లీనం చేసి మరేదీ దాని రూపంకానట్టు ఏ మాత్రమూ పట్టించుకోకుండా కూచున్నాడు. ఇది అసలైన భక్తి కాదు. ప్రాకృత భక్తి అని పేరు పెట్టింది దీనికి భాగవతం.
అర్చాయా మేవతు హరేః - పూజాంయః శ్రద్ధయే హతే నతద్భక్తేషు చాన్యేషు - సభక్తః ప్రాకృతః స్మృతః
ఎవడైతే భగవదర్చనలోనే నిమగ్నుడై ఆయన పూజ శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఆ భగవద్భక్తులైన ఇతర మానవుల నుపేక్షిస్తాడో వాడు ప్రాకృతుడట. అలాగే ఉపేక్షించాడింద్రద్యుమ్నుడు కూడా. తన కోసమని వచ్చిన అగస్త్యుని కన్నెత్తి చూడలేదు. అతడు భక్తుడు కాదనా, భగవదంశ లేనివాడనా, “ఈశ్వర స్సర్వ భూతానామ్. వాసుదేవ స్సర్వమితి" అని గదా శాస్త్ర వచనం. సర్వమూ ఈశ్వర స్వరూపమే అయినప్పుడు సర్వత్రా ఆ రూపాన్నే దర్శించాలి నీవు. అలా దర్శిస్తే ఇక లేవకపోవటమూ, పూజించకపోవటమంటూ ఉండదు. కాని అలాంటి దర్శనానికి నోచుకోలేదీ ఇంద్రద్యుమ్నుడు. సగుణభక్తుడే గాని నిర్గుణభక్తుడు కాడతడు. అందుకే కండ్లు మూసుకొంటే అతడికిక ప్రపంచమే కనపడలేదు. ఆయన కళ్లు తెరిపించదలచాడు సత్యప్రబోధం చేసి. ఎవరు. అగస్త్యుడా. కాదు. అగస్త్యుడనే నెపంతో పరమాత్మే. ఆధ్యాత్మికంగా చూస్తే అగస్త్యాదులైన ఇలాంటి వారినంతా అధికారిక పురుషులంటారు. వారికొకరిని భూషించాలని లేదు. దూషించాలనీ లేదు. భగవంతు డాయా భక్తుల చిత్తవృత్తిని పరీక్షించి తన్మూలంగా వారి నప్పుడున్న స్థాయి నుంచి పయిస్థాయికి తీసుకుపోవాలని ఒక పరీక్ష పెడతాడు. తాను పెట్టబోయే
Page 305