జీవుడికుండే ధనమూ, ప్రకాశమూ అతని జ్ఞానమే. అలాంటి ఈశ్వర భావనా జ్ఞానమూ ఉన్న మహనీయుడాయన. వైష్ణవ ముఖ్యుడు. విష్ణు భక్తులలో అగ్రేసరుడు. మౌనవ్రత ధారియై సర్వాత్ముడైన నారాయణమూర్తి నొక పర్వత శిఖరం మీద కూర్చొని షోడశోపచారాలతో విశేషంగా పూజ చేస్తూ వచ్చాడు.
ఇలా ఉండగా
ఒకనాడా నృపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియై యకలంక స్థితి నున్నచో - కలశజుం డచ్చోటికిన్ వచ్చి
మనస్సులో విష్ణు స్వరూపాన్ని నిలుపుకొని ఎలాటి మనో విక్షేపమూ లేకుండా మౌనముద్ర ధరించి నిశ్చలంగా ఉన్నాడట. అలాంటి సమయంలో బొట్టు పెట్టినట్టు వచ్చాడక్కడికి అగస్త్యుడనే మహర్షి. “లేవక పూజింపక యున్న మౌని గని" వస్తే ఈ రాజు లేవనే లేదు. అర్ఘ్యపాద్యాదులతో పూజించలేదు. ఎలా చేస్తాడు మౌని గదా. అయినా సహించలేదా అగస్త్యుడు. "నవ్యక్రోధుడై వెంటనే ఎక్కడ లేని కోపం వచ్చింది." మూఢ ! లుబ్ధ ! కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపంబిచ్చె” ఓరి మూఢా, ఓరి లుబ్ధా, నీవు నన్నవమానించావు కాబట్టి వెంటనే పోయి ఒక గజేంద్రుడి జన్మ ఎత్తు పొమ్మని శాపమిచ్చి వెళ్లిపోతాడు. వెంటనే కరినాథుడయ్యె నాతడు కరులైరి భటాదులెల్ల.
ఏమిటీ అన్యాయం. ఆయన చేసిన పాపమేమిటి. వైష్ణవ ముఖ్యుడు పుణ్యాత్ముడయిన వాడా ఇంద్రద్యుమ్నుడు. ఏదో మౌనంగా ధ్యానంలో కూచొని ఉన్నాడు. ఎవరినీ అవమానించటమూ గాదది. తూలనాడటమూ గాదు. మహా అయితే వచ్చిన పెద్ద మనిషిని లేవలేదు. సత్కరింపలేదని గదా. ఎలా లేస్తాడు. సత్కరిస్తాడు. కండ్లు మూసుకొని మౌన సమాధిలో కూచున్నవాడాయె. కన్నెత్తి చూస్తే గదా లేవటమూ. సత్కరించటమూ. అది అతని అపరాధమెలా అవుతుంది. కాకుంటే ఇతడు శాపమివ్వటమేమిటి. శాపమిచ్చేటంత మహాపరాధమేమి చేశాడని. చేయకపోతే అతడెలా శాపమిచ్చాడు. ఇచ్చాడేపో. అది ఎలా ఫలించగలిగిందని ప్రశ్న పరంపర ఉదయించే అవకాశ ముందిక్కడ.
దీనికి కొంచెం లోతుకు దిగి చూస్తే ఆ అగస్త్యుడా రాజునే చేసిన సంబోధనలోనే ఉంది జవాబు. మూఢ, లుబ్ధ అని గదా సంబోధించాడాయన. మూఢ అంటే
Page 304