#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

అలా మాపితే ఇక మిగిలిందేమిటి మన పాలిటికి. ఊహ కలంగి జీవనపు టోలమునం బడి పోరుచో - మహా మోహ లతా నిబద్ధ పదమున్ విడిపించు కొనంగ లేక సం దేహము బొందు దేహి క్రియ దీన దశన్ గజముండె - భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమై

  ఈ దీన దశ గజేంద్రుడిదే గాదు. మానవ గజేంద్రుడిది కూడా. అది జీవనపు టోలాన బడి పోరుతున్నట్టే వీడూ పోరుతుంటాడు. జీవనమంటే జలమూ జీవనమే. జీవితమూ జీవనమే. జలాన్ని ఒక ఆదరువు చేసుకొని విజృంభిస్తున్నది మకరి. అలాటి ఆధారం లేనివాడు గజేంద్రుడు. అందుకే బ్రతుకుమీద ఎంత ఆశ ఉన్నా తన పదాన్ని విడిపించుకోలేడు. కారణం. అది మహా మోహలతా నిబద్ధం. ఒక మానవుణ్ణి కూడా ఈ మోహమే ఒక లతా వలయంలాగా చుట్టుకొని బాధిస్తున్నది. దానివల్ల వీడు కూడా ఈ సంసార కర్దమంలో దిగబడ్డ తన పాదాన్ని పైకి తీసుకోలేక చీకాకు పడుతుంటాడు. అందుకే ఊహలన్నీ అపోహలయి సందేహాలే క్రందు కొంటాయి దేహిని. ఈ దేహధారి అయిన మానవుడిలాగే ఉన్నాడా గజేంద్రుడు కూడా. భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టన కక్కడా తట్టుకొనే పరిస్థితి కాదు. ఇక్కడా కాదు.

  అయితే ఏమిటిక గతి. ఏమిటని ప్రశ్నే లేదు. ఎన్ని రాత్రులు పోరినా పగళ్లు పోరినా, వారాలు మాసాలు, అయనాలు వర్షాలు -గడచినా- మనం జయించలేము. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడింది. అయినా ప్రయోజన మేముంది. బాగా శిథిలమయి పోయింది. అంతే, అప్పుడు గాని కండ్లు తెఱిచింది కాదది. ఆలోచించింది కాదు. దీన్ని గెలవటమిక మనకు సాధ్యం కాదని తీర్మానించుకొన్నది. ఇక్కడ ఉంది మనం గ్రహించవలసిన ఒక రహస్యం. అంతకు ముందు గడచిన జీవితానికిది ప్రతిలోమమైన జీవితం. ముందెంత వైభవోపేతంగా బ్రతుకుతాడో మానవుడు కాలం చాలకపోతే అంత దీనాతిదీనంగా బ్రతకవలసిన కర్మ పడుతుంది. ఆ మిడిసి పాటే ఈ భంగపాటుకు దారి తీస్తుంది. అలాగే జరిగిందీ గజేంద్రుడి విషయంలో.

Page 302

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు