#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరిఁదిగుచుఁగరకరి బెరయన్ కరికి మకరి- మకరికిఁగరి భర మనుచును నతల కుతల భటు లరుదువడన్

  ఇది దానినీ అది దీనినీ ఇటూ అటూ లాగటంతో సరిపోయింది. లోక భీకరంగా జరిగింది పోరాటం. నిర్గత నిద్రాహారములై అవక్ర పరాక్రమ ఘోరములై అవి అలా పోరుతుంటే తమ నాథుణ్ణి ఒంటి జేసి పోలేక పెంటి ఏనుగులన్నీ గ్రుడ్లప్పగించి చూస్తూ నిలబడి పోయాయి. వాటికీ మమకారమే గదా ప్రాణ విభుడంటే. విడిచి ఎలా పోగలవు.

  ఇలా ఏండ్లూ పూండ్లూ గడుస్తున్నాయి. బలమూ చలమూ జీవమూ అంతకంత కెక్కువవుతున్నాయి మకరానికి కారణం దానికి జీవనమే జీవనం. ఎక్కకేమవుతుంది. జీవనమంటే జలం. జలమే జీవనం గదా మొసలికి. అందుకే విజృంభించింది. మనకు పట్టుకొన్న సంసార మకరానికి కూడా మన జీవనమే జీవనం. అంటే మన జీవితమే దాని కాటపట్టు. అందుకే దీనికీ ఇంత విజృంభణ. పోతే ఇలాంటి బలమైన ఆధారం లేని శుష్కమైన భూమిమీద నిలిచి ఉన్నది గజేంద్రం. కనుకనే “డస్సె మత్తేభ మల్లంబు బహుళ పక్షశీత భానుపగిది" డయ్యక ఏమవుతుంది. మరి దీని బలం సన్నగిల్లే కొద్దీ దానికెక్కడ లేని నిక్కు, ద్విగుణీకృతమవుతుంది దాని ప్రతాపం.

  ఉఱుకుం గుంభ యుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు పాదమ్ములన్ నెఱయున్, కంఠము వెన్ను.... దన్ను శల్యంబులున్ దంతముల్ విఱుగన్ వ్రేయుచు బొంచి పొంచి కదియున్

  ఇలా ఎన్ని విధాలుగానైనా సరే పైన బడి బాధిస్తుంది. పొంచి ఉంటాయి ఈ సంసార క్లేశాలు కూడా. ఎప్పుడు వచ్చి ఏది మీద బడి మనలను పీడిస్తుందో చెప్పలేము. అందుకు కారణమొక్కటే. అహంకార మమకారాలు కారణాలైనా వాటికి కూడా మూలకారణమొకటున్నది. అది మహా మాయాంధకారం. అది జ్ఞాని అయినవాడి జోలికి రాదు. వాడినేమీ చేయదు. అల్పహృదయుడి జ్ఞానదీపాన్ని మాత్రమాక్రమిస్తుంది. రూపుమాపుతుంది. ఆర్పివేస్తుంది.

Page 301

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు