#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

విహరిస్తాము. అది మనకెలా కనిపిస్తుంది. అనంగ విద్యా నిరూఢపల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకార యగు కుసుమ కోమలిలాగానే వ్యాకీర్ణ చికురమత్త మధుకర నికర, విగత రస వదన కమల, నిజ స్థాన చలిత కుచ రథాంగ యుగళ లంపటిత జఘన పులినతల ఇంత ముగ్ధ మనోహరంగా భాసిస్తూ మన మనసులనే దోచుకొంటుంది. ఇటు అటు కదలనీయదు. గట్టిగా పట్టుకొంటుంది.

  అలా పట్టుకొనేదే గ్రాహం. గ్రహమన్నా గ్రాహమన్నా అక్షరార్థం ఒక్కటే. గ్రహించేదేదో అది గ్రహం. కాలమే గ్రహం. అదే గ్రాహం మన పాలిటికి. ఎప్పుడే రూపంలో వచ్చి మనమీద దాడి చేస్తుందో ఏమి ముప్పు తెచ్చి పెడుతుందో చెప్పలేము. మన అంతవాడు లేడు గదా అని విఱ్ఱవీగుతుంటాము. మయి మఱచి ఉంటాము. అలా ఏమఱించి పైన బడే స్వభావం దానిది. మకరి పట్టు దాని పట్టు. అలాగే పట్టింది గజేంద్రుణ్ణి.

భుగ భుగాయిత భూరిబుద్బుదచ్ఛటలతో కదలుచోదివికి భంగంబులెగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్ర గ్రాహకోటి బెగడ వాల విక్షేప దుర్వారఝంఝానిల వశమున ఘుమఘుమావర్త మడర కల్లోల జాలసంఘట్టనంబుల తటీ తరుల మూలంబులై ధరణి గూల

సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను గబళించి పట్టు స్వర్భాను పగిది నొక్క మకరేంద్రు డిభరాజు నొడిసి పట్టె


  భానుడంటే సూర్యుడు. సూర్యుడు మన బుద్ధి తత్త్వమే. బుద్ధి పెడతల పట్టినప్పుడే కాలమనే గ్రాహం మనలను ఒడిసిపట్టేది.

  అయితే అలా పడితే చూస్తూ ఊరుకోలేడు మానవుడు. అహం మమలు రాజ్యమేలుతున్నాయి గదా. ఎలా ఊరుకోగలడు. అవే పురికొల్పుతాయి ప్రతీకారానికి. వాటి బలంతో శక్తి కొద్దీ పారోడుతాడు. వచ్చిన ఉపద్రవమెలాగైనా తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తాడు. అలాగే యత్నం సాగించాడు గజేంద్రుడు. .

Page 300

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు