#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

పంచకంలో మానవుని పంచేంద్రియాలూ లగ్నమవుతాయి. దానితో ఎక్కడలేని మఱపూ మైకమూ గ్రమ్మి సంసార సాగరంలో తలమునుకలవుతారు.

తోయజ గంధంబు దోగిన చల్లని - మెల్లని గాడ్పుల మేను లలర కమల నాళాహారవిమల వాక్కల హంస, రవములు సెవుల పండువులు సేయ ఫుల్లదిం దీవరాం భోరుహా మోదంబు ఘ్రాణ రంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతా సారంబు - వదన గహ్వరముల వాడు దేర్ప

త్రిజగ దభి నవ సౌభాగ్య దీప్తమైన విభవ మీక్షణముల కును విందుసేయ నరిగి పంచేంద్రియ వ్యవహారములను మఱచి మత్తేభయూథంబు మడువు సౌచ్చె


  ఏమిటిది. మదగజ వ్యవహారమా. కాదు. మద గజ వ్యాజంతో సాగిన మానవ వ్యవహారమే. పంచేంద్రియ వ్యవహారములూ మరచి మడుగు సొచ్చిన వాడు మానవుడే. చొచ్చి ఊరకున్నాడా. లేదు.

ఇభ్రలోకేంద్రుడు హస్త రంధ్రముల నీరెక్కించి పూరించి చం డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి

కరిణీ కరోద్ఘాత కంకణచ్ఛట దోగిసెలయేటి నీలాద్రి చెలువు దెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయిగన్నుల వాని వెరవు సూపు మద కరేణు ముక్త మౌక్తిక శక్తుల మెఱుగు మొగిలు తోడమేల మాడు నెదురులేని గరిమ నిభ రాజమల్లంబు వనజ గేహకేళి వాలునపుడు


  ఇలా అంతకంతకా విషయ సుఖాలతో తాదాత్మ్యం చెంది తనకు గాగా ఇంతటి ఐశ్వర్య మబ్బిందని ఎంతటి వాడినైనా బెబ్బెబ్బె అంటూ ఎదురు లేని వీరుడి లాగా స్వైర విహారంచేస్తాడు. ఎక్కడ, కాసారంలో కాదు కాదు. సంసారంలో. సంసారమే కాసారం. సారం లేకపోయినా సారభూతంగా భాసిస్తుంది. చక్కగా అలంకరించుకొని ఎదుట సాక్షాత్కరించిన గృహలక్ష్మి మన పాలిటికది. దానితో వివిధ కేళీ లాలసులమై

Page 299

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు