#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

కుక్కదిన్నవాడు గురుమిండ జంగంబు పంది దిన్నవాడు పరమయోగి ఏన్గు దిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభి రామ వినురవేమ

  కుక్కను దీంటే వాడు గొప్ప శివభక్తుడు. పందిని దింటే వాడు పరమయోగి. ఏనుగునే తినకలిగితే ఇక వాడెంత జ్ఞానో చెప్పలేమట. కుక్క ఏమిటి, పంది ఏమిటి, ఏనుగేమిటి. వాటిని మనం తినటమేమిటి. ఇది గాదు వేమన అభిప్రాయం. ఆయనచెప్పదలచిన రహస్యం వేరు. అది అధ్యాత్మికం. కుక్క అంటే మనస్సు. కుక్కలాగా చపలమయింది. పంది అంటే మమకారం. పందిలాగా బురదలోనే పోయి పడుతుంది. అంటే సంసార పంకం. పోతే ఏనుగేమిటి ఇక. ఏనుగంటే అహంకారమే. ఏనుగులాగా ఇటూ అటూ చూడకుండా ఎవరినీ లెక్క చేయకుండా వీధి వెంట ఛాతీ విరుచుకొని వెళ్లుతుంటా డహంయువైన మానవుడు. ఇలాంటి అహంకారాన్ని కూడా అణచి పుచ్చగలిగితే వాడే మహాజ్ఞాని అని కవి హృదయం.

  దీనిని బట్టి గజేంద్రుడనే మాట ఇక్కడ కేవల మహంకారమనే భావానికొక ప్రతీక మాత్రమే. దానికి తగినట్టే ఉన్నదా గజేంద్రుని ప్రవర్తన కూడా. అడవిలో ఉండే సింహ వ్యాఘ్ర భల్లూక ఫణి ఖడ్గ గవయాదులన్నీ తన ఢాకకు నిలవలేక పరుగెడుతుంటే దొరకిన వాటిని పట్టి శిక్షిస్తూ కొండలు కూడా తలక్రిందై పడేలాగా మారులేక మసలుతూ వచ్చింది. ఇదంతా అహంకారానికీ సూచనే. అహంకార మెప్పుడుందో అది తప్పకుండా మమకారానికి దారి తీస్తుంది. రెండూ ఒకదానికొకటి అన్నదమ్ముల లాంటివి. అహంకారమే మమకారానికి మార్గదర్శి. గజేంద్రుడు దశలక్ష కోటి కరిణీ నాథుడట. అవి ఉభయ పార్శ్వములా బలసి కొలుస్తుంటే వాటిమీద తగులంతో తిరుగుతుండేవాడు.

పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక జెలుల కందిచ్చు నచ్చికము లేక ఇవురుజొంపముల గ్రివ్వెలయుపూ గొమ్మల ప్రాణవల్లభలకు బాలు పెట్టు ఘన దాన శీతల కర్ణ తాలంబుల దయితల చెమటార్చుఁదనువులరసి మృదువుగా గొమ్ముల మెల్ల న గళములు నివురుచు బ్రియముతో నెఱపువలపు

Page 297

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు