#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

చిక్కి శల్యావశిష్ట మయిందట. తొండము పయికెత్తి కుయ్యో అని మొఱ పెట్టిందట. మొఱ చెవిన బడిందో లేదో ఇటూ అటూ చూడక ఆ శ్రీమన్నారాయణుడే పరుగెత్తి వచ్చాడట. అవక్రమైన ఆ మకరాన్ని చక్రంతో ఛేదించి దాని పాదం విడిపించి కాపాడాడట.

  ఇది యథార్ధంగా జరిగిందనేనా. జరిగిందని అనుకోటం దేనికి. అనుకోవాలని వ్రాయలేదీ కథ మహర్షి. కథలన్నీ పరమార్థానికి సంకేతాలుగానే భావించి కల్పించాడని గదా ముందు నుంచీ వాకొన్నాము. పురంజనో పాఖ్యానంలో అది మహర్షే మనకు దాఖలా చేసి చూపాడు. ఇదీ ఒక పురం జనోపాఖ్యానం లాంటిదే. అంతకన్నా వేరుగాదు. అక్కడ వాచా సంకేతాన్ని వివరించిచెబితే ఇక్కడ మన కక్కడక్కడా వ్యంగ్యంగా సూచిస్తూ వస్తాడు. గజమంటే అసలు అహంకారమని అర్థం. యదా కించిన్హోహమ్ గజ ఇవ మదాంధస్సమ భవమ్ తదా సర్వజ్ఞో స్మీత్య భవదవలిప్తం మమ మనః యదా కించి త్కించిద్బుధజన సకాశాదధి గతమ్ తదా నజ్ఞోస్మీతి జ్వర ఇవ మదోమేవ్యవగతః అన్నాడు భర్తృహరి.

తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వమున్ తెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి దొల్లి

  దృప్తత అంటే గర్వమే. అది అహంకారానికి మారుపేరు. ఏ మాత్రమూ జ్ఞానం లేకపోయినా ప్రతివాడూ తానెంతో సర్వజ్ఞుడనని గర్వంతో తిరుగుతుంటాడు. అంతో ఇంతో పెద్దల దగ్గర విషయం తెలుసుకొన్నాడంటే చాలు. అనవసరంగా తెచ్చి పెట్టుకొన్న ఆ మిడిసి పాటంతా పటాపంచెలవుతుంది. ఇదుగో ఈ మిడిసి పాటూ ఈ అహంభావమే గజభావం. అహంభావిని గజంతో పోల్చి చెప్పటంలోనే ఈ రహస్యం బోధపడుతున్నది.

  ఇలాగే వేమన కూడా ఒక మాట అంటాడు.

Page 296

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు