11. సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు
మనమింత వరకూ భాగవతంలోని సగుణభక్తిని గురించీ ఆ మార్గంలో పయనించిన ఆయా భాగవతుల జీవితాలను గూర్చీ చర్చించాము. పోతే ప్రస్తుతం క్రమప్రాప్తంగా మనమింక ఆఖరుదైన నిర్గుణభక్తిని గూర్చి చర్చించవలసి ఉంది. నిర్గుణభక్తి అన్నా, పరాభక్తి అన్నా, జ్ఞాననిష్ఠ అన్నా, అన్నీ ఒకే అర్ధాన్ని చెప్పే మాటలు. ఇది మోక్షసాధన మార్గంలో ఆఖరి భూమిక. దీని తరువాత సాధన అంటూ ఏదీలేదు. ఇకసిద్ధే. అది మోక్షమే. ఈ మోక్షం కోసమే పరీక్షిత్తు తాపత్రయం. అది ఎలా లభిస్తుందో సెలవీయమనే శుకమహర్షి నాయనప్రాధేయపడింది. దాన్ని ఆయన కుపదేశించటానికే బ్రహ్మరాతుడైన శుకుడాయనికీ భాగవతాన్నంతా ఏ కరువు పెట్టింది. అంచేత భాగవత తాత్పర్య మీ నిర్గుణ భక్తి ప్రతిపాదనమే. కనుకనే ఇది కట్టకడపటి దశ. మిగతా కర్మ యోగాదులన్నీ దీనికి పూర్వదశలు. ఒక్కసారిగా దీనికి నోచుకోలేని మానవులాయా భూమికలలో ప్రయత్నం సాగిస్తూ వస్తే వాటన్నిటి ఫలితంగా ఇది చేతికి చిక్కుతుంది. కాబట్టి పూర్వ పూర్వం ఉత్తరోత్తరానికి పూరకం.
అందులో మొదటి కక్ష్య కర్మయోగం. అది సాధకుడికి చిత్తశుద్ధిని ప్రసాదిస్తుంది. రెండవ కక్ష్య సమాధి. అది వాసనా క్షయం ద్వారా ఏకాగ్రతను ఆపాదిస్తుంది. మూడవది సగుణభక్తి. అది ఒక ఆలంబనాన్ని సమకూరుస్తుంది. పోతే ఆలాలంబనాన్ని కూడా వదిలేసిన నాలుగవ కక్ష్య ఇది. ఆలంబనమంటే భగవతత్త్వాన్ని ఏదో ఒక రూపంలో గుణంలో పట్టుకోటం. అలా పట్టుకొంటూ వచ్చినవారే గోపికలూ అక్రూరుడూ ఉద్దవుడూ ఇలాటి భాగవతులంతా. అవ్యక్తమైన తత్త్వాన్ని వ్యక్తమైన రూపంలో చూస్తూ పోయారు వారు. అయితే అది అసలైన తత్త్వం కాదు. అందుకే "అవ్యక్తమ్ వ్యక్తి మాపన్నమ్-మన్యంతే మామ బుద్ధయః" అని వారినందరినీ అల్పమేధనులని అంత మెచ్చడు పరమాత్మ. అయితే మరి ఎవరు సుమేధనులని అడిగితే “పరమ్ భావమజానంతో మమా వ్యయ మనుత్తమమ్" అవ్యయమూ అనుత్తమమూ అయిన నా పరతత్త్వాన్ని దర్శించినవాడే పరమ భాగవతుడని
Page 294