మోక్షఫల మందీయదు. కాబట్టి జీవిత శేషమంతా అంతవరకూ పట్టుకొన్న గుణ చింతనకు స్వస్తి చెప్పి తత్పరిపాక రూపమైన జ్ఞాన విజ్ఞానాల నాలంబనం చేసుకొని తరించమని చివరకు బోధ చేస్తాడు. ఇంతకూ కేవల సగుణ దృష్టి ఉన్నంత వరకూ త్రిగుణాత్మక సృష్టి నుంచి ముక్తిలేదు భక్తుడికి. అది ప్రకృతి గుణాలే కావచ్చు. భగవద్గుణాలే కావచ్చు. గుణాలు గుణాలే. అవి అపరిచ్ఛిన్నమైన తత్త్వాన్ని పరిచ్ఛిన్నం చేసి చూపుతాయి. అలా చూపటంవల్లనే కడపటిదాకా కృష్ణుని దివ్యసుందర విగ్రహాన్నే చూస్తూ ఆయన మధురమైన మాటలే వింటూ, ఆయన గారి లీలలే తిలకిస్తూ, పరవశులై బ్రతుకులు సాగిస్తూ పోతే చాలు. అదే పరమపద ప్రాపకమని నమ్ముతూ వచ్చారా గోప గోపికాదులంతా. అక్రూరాదులూ అలాగే విశ్వసించారు. అది ఎప్పటికైనా తుప్పు రాలినట్టు రాలిపోతే తప్ప అసలైన భగవత్తత్త్వాన్ని మీరు పట్టుకోలేరని బోధించటానికే భగవానుడు చివరకు వారందరినీ ఎక్కడి వారి నక్కడ దూరంగా సాగనంపి తాను కూడా వారికి దూరమై పోతాడు. ఆయన అలా భౌతికంగా దూరమై పోవటంలో ఇదీ పరమార్థం. అలా ఆయన దూరమైనప్పుడే అర్జునాది పాండవులు గానీ, అక్రూరాది యాదవులుగానీ, అందులోని అంతరార్థాన్ని గ్రహించి బాగుపడగలిగారు.
Page 293