#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  ఉద్ధవుడు మరలా మనకు కృష్ణుడు రాజసూయ యాగానికి బయలుదేరే ముందు కనిపిస్తాడు. రాజసూయానికి వెళ్లటమా, మానటమా, అని తేల్చి చెప్పమని ఉద్ధవుని అడుగుతాడు కృష్ణుడు. పైగా "అనఘ చారిత్ర నీవు మా అక్షి యుగము వంటివాడవు. మనకు నవశ్యమగుచు జేయదగినట్టి కార్యంబు జెప్పు” మని తనకు తెలిసినా ఆ భక్తుడికి మర్యాద ఇచ్చి మాటాడుతాడు. ఇది మర్యాద ఇవ్వటమయినా కావచ్చు. ఆయన భక్తి మర్యాద ఎంతటిదో పరీక్షించటమైనా కావచ్చు. ఆ భక్తుడెప్పుడో గమనించాడా మాటలలోని మర్మం. అతని పాదాంబు జంబులు మనంబున నిడుకొని వృద్ధాను మతంబుగా నాయెఱించిన తెఱంగు విన్నవించెదనంటాడు. ఆ తెఱగత డెఱిగిస్తే అక్కడ ఉన్న యాదవులు సదస్యులు నారదుడు అందరూ ఆయన నభినందిస్తారట. అలా తన భక్తుణ్ణి నలుగురూ అభినందించాలనే అప్పటికా నంద నందనుడి ఆశయం.

  మరలా ఇక ఉద్ధవుడు మనకు సకల యదువంశ సంక్షయమైన తరువాతగాని కనిపించడు. అదే ఇక ఆఖరుసారి కనిపించటం. యుగక్షయమయి పోతున్నదిక నీవూ మాకు దూరమవుతున్నావు. నీదాసులమైన మాకేదైనా తరుణోపాయం ప్రసాదించి పొమ్మని ప్రాధేయపడతా డుద్దవుడు. దానికి నందాత్మజుడానందించి ఆయన కెవరికీ చెప్పని జ్ఞానయోగ రహస్యాలన్నీ సోదాహరణంగా వర్ణించి చెప్పి చివరకు.

గచ్చోద్ధవ మయా దిష్టో - బదర్యాఖ్యమ్ మమాశ్రమమ్ తత్ర మత్పాద తీర్థాదే - స్నానో పస్పర్శనైశ్శుచిః ఈక్షయాలక నందాయా విధూతా శేష కల్మషః వసానోవల్క లాన్యంగ వన్యభుక్సుఖనిస్పృహః మయ్యా వేశిత వాక్చిత్తో - మద్ధర్మ నిరతో భవన్ తితిక్షుర్ద్వంద్వ మాత్రాణాం - సుశీల స్సంయ తేంద్రియః శాంతస్సమాహి తధియా - జ్ఞాన విజ్ఞాన సంయుతః మయాను శిక్షితం యత్తే- వివిక్త మను భావయన్ అతిక్రమ్య గతీస్తిస్రో - మామేష్యసి తతః పరమ్

Page 291

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు