#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

నిరూపించుకోరాదా అని ఎంత నాజూకుగా మందలిస్తాడో చూడండి ఆ మహనీయుడు. దాని కా ముదుసలి నీ మాట మంచిది, నిశ్చయంబని మెచ్చుకోక తప్పింది గాదు. అయినా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడే గదా. నాదేముంది అంతా ఈశ్వరేచ్ఛ అది ఎలా ఉంటే అలాగే జరుగుతుందని లౌక్యం ప్రదర్శించబోతాడు. లోకోత్తరుడైన మహాభక్తుడి దగ్గరనా ఈ లౌక్యం. దాని కక్రూరుడిచ్చిన జవాబు చూడండి. నీ తలంపు గనుంగొంటి. నీ కిష్టంబగునట్లు వర్తింపుము. అంటే నీ తలంపే దుష్టమైనది. దానికి తగినట్టే నీ ప్రవర్తన. మరి ఆ ప్రవర్తనకు తగిన ఫలితమే చవి చూడబోతావు చివరకని హెచ్చరిక. ఈ హెచ్చరిక చేసి ఇక ఇతనికి చెప్పుట మనవసరమనుకొన్నాడో ఏమో. వెంటనే మధురకు బయలుదేరుతాడు. ఇదీ అక్రూరుని భాగవత సేవ.

  పోతే ఈ జంటలో రెండవవా డుద్దవుడు. ఇతడూ యదువంశోద్భవుడే. వయో వృద్ధుడే. కృష్ణుని కితడు స్నేహితుడూ, అమాత్యుడూ, ఆచార్యుడూ, చివరకు శిష్యుడూ కూడా. ఇన్ని భూమికలలోసేవించాడా పరమాత్మను. ఉద్దవం, ఉత్సవం ఇవి రెండూ పర్యాయపదాలు. పండుగ అని శబ్దార్థం. భగవంతుడి సాహచర్యమే అతని కొక పండుగ. ఒక విందు భోజనం. అది తప్ప అన్యమెఱుగని వాడు. ఎఱిగినా అంతకన్నా మెఱుగసని వాడు. మరి తన స్వామిచేతనే తాను సిద్ధవిచారుడనీ, గభీరుడనీ, వృద్ధవచో వర్ణనీయుడనీ వృష్టిప్రవరుడనీ, బుద్ధినిధి అనీ, అమర గురుసముడనీ, ఎంతగానో ప్రశంసలందుకొన్న మహనీయుడాయన. కనుకనే ఏదైనా తన కాంతరంగిక కార్యముంటే అది అక్రూరుని లాగానే ఉద్దవుడికే అప్పగిస్తుంటాడా పరమాత్మ.

రమ్మా యుద్ధవ గోపకామినులు నారాకల్ నిరీక్షించుచున్ సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో తమ్మున్ నమ్మిన వారి దిగ్గ విడువన్ ధర్మంబు గాదండ్రు - వే పొమ్మా ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్

  అని అక్రూరుణ్ణి పంపినట్టే రాయబారం పంపుతాడు గోపికల వద్దకు. అయితే అక్రూరుడాయనను మధురకు తీసుకుపోవటానికైతే - ఉద్దవుడాయన రాక తెలపటానికి.

Page 287

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు