#


Index



సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు

  అలాటి ఛద్మరూపమైన దౌత్యమేదో చూచాము భారతంలో. అది ఛద్మ స్వభావులైన భారత వీరులకు తగినట్టే సాగిందక్కడ. అదే సాధు స్వభావుడైన ఒక భాగవతుడి ద్వారా నడిస్తే ఎలా ఉంటుందో చూపదలచా డిక్కడ మహాముని. అది క్రూర స్వభావుడిదైతే ఇది అక్రూర స్వభావుడిదీ రాయబారం. సాధుపలవ ఎలా మాటాడుతాడో తెలుసుకోవలసి ఉంది. ఇందులో స్వార్ధం లేదు. ఛద్మం లేదు. కేవల లోకహితమే ప్రయోజనం. భగవానుడి ఉద్యమమే అది. భగవద్దత్తాధికారులైన లోక సంగ్రహ పరాయణులది కూడా అదే. ఏతదర్ధ నిరూపణార్థమే ఈ సన్నివేశం. అక్రూరుడు మహా ప్రసాదమని కృష్ణుని వీడ్కొని కరిపురాని కరిగి ధృతరాష్ట్రాదులనూ, కుంతీ విదుర సమేతులైన పాండవేయులనూ ఇరువాగుల వారినీ కలుసుకొంటాడు. కొన్ని రోజు లేదీ బయట పెట్టకుండా అలాగే ఉండిపోతాడు. కుంతి తమ పుట్టింటి వారి క్షేమ సమాచారాలన్నీ అడుగుతుంది. తన బిడ్డలకు కలిగిన ఆపదలన్నీ వలపోసుకొని బాధపడుతుంది. వారి ఆపదలను పాపటానికి కృష్ణుడిప్పటికైనా సంసిద్ధుడేనా అని ప్రశ్నిస్తుంది. అక్రూరుడు విదురునితో కలిసి ఆమె నోదార్చిన తరువాత ధృతరాష్ట్రుని కొలువు కూటంలో దర్శిస్తాడు. నలుగురూ వినేలాగా కొలువులో అత్యద్భుతంగా ఉపన్యసిస్తాడు. అది సంజయునిదీ గాదు. కృష్ణునిదీ గాదు. అక్రూరుని ఉపన్యాసమది. ఒక మహాభక్తుడూ విరక్తుడూ అయినవాడు కేవల లోకహితం కోరి ఎలా ధాటిగా నిర్మొగమాటంగా చెబుతాడో అలా చెప్పాడు. ఈ రాజ్య ధనాదులు శాశ్వతమని భ్రాంతి పడుతున్నావు ధృతరాష్ట్రా. మీన జీవనభూత మిళిత జలమిది. ఒక చేప మ్రింగి క్రక్కిన జలమింకొక చేప మ్రింగుతుంది. అదీ క్రక్కవలసిందే మరలా. కాబట్టి.

నిందం బొందకు మయ్య ఈ తనువు తానిద్రా కళా దృష్టమౌ సందోహంబు విధంబు - నిల్వదు సుమీ - జాత్యంధతం బొందియున్ మందప్రజ్ఞతనేల చేసెదవు సమ్యగ్ జ్ఞాన చక్షుండవై సందేహింపక యిమ్ము పాండవులకున్ సర్వం సహా భాగమున్

  అని తెగవేసి ముక్తసరిగా ఉన్న సత్యాన్ని బోధిస్తాడు. శారీరకంగా వచ్చిన గ్రుడ్డితనాన్ని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ మానసికంగానైనా గ్రుడ్డి వాడనుకాదని

Page 286

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు