ఉద్దవుడితో కలిసి వచ్చాడు. ఉద్దవుడూ తనలాంటి ఒక మహాభక్తుడే. రాగానే ఉద్ధవుణ్ణి గాఢంగా కౌగిలిస్తాడక్రూరుడు. భక్తి అనే సూత్రమెంత గాఢమయిందో అది సజాతీయాన్ని సజాతీయంతో కలపటంలో ఎనలేని పటిమ గలది. తన ఇష్టదైవతం పాదాలు తొడలమీదే ఇడుకొన్నా డక్రూరుడు. ఆయన పరతత్త్వ ప్రభావమూ, అవతార ప్రయోజనమూ, నానావిధాల స్తోత్రం చేస్తాడు. “ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మ మందిక్కడన్ నీ పాదంబులు గంటిని నా భవ బంధాలు పాప” మని ప్రార్ధిస్తాడు. సరేనని సర్ది చెబుతూనే ఆయనకు సంసార మోహాన్ని కీలు కొలుపుతూ ఆ పరమాత్మ ఆయన కొక ఉద్యోగాన్ని అప్పగిస్తాడు. అక్రూరా నీవు గుణవంతుడవు, పరమ భాగవతుడవు, విగ్రహారాధనలు, తీర్థాటనాదులు, చేసే వారికన్నా మత్పద భక్తులైన మీబోటి వారు చాలా గొప్పవారు. అలాంటి నీకొక పని అప్పగిస్తున్నాను. అది ఏమంటే పాండవులు మనకు బంధువులు. చాలా కావలసిన వారు. వారు తమ తండ్రిని కోలుపోయి హస్తినాపురానికి వచ్చి ఉన్నారు. వారి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు వారి నంత ప్రేమగా చూడటంలేదు. కాబట్టి నీవు నా తరఫున పోయి ధృతరాష్ట్రుడికి నా మాటగా బుద్ధి చెప్పి వారిని చక్కగా చూచేలాగా చేసి రమ్మని రాయబారిగా పంపుతాడు.
చూడండి. ఇది ఎంత చిత్రమైన కథో. అక్రూరుడెవరు. పాండవులెవరు. వారి దగ్గర కితడు రాయబారిగా వెళ్లటమేమిటి. భారత పాత్రలు పాండవులు. భాగవత పాత్ర అక్రూరుడు. ఒకరికొకరికి సంబంధమే లేదే. బట్ట తలలకు మోకాళ్లకు ముడిపెట్టి నట్టున్నదిది. ఇదే మహర్షి కథా కల్పనా పాటవం. ముందే మనవి చేశాను. ఒకానొక సత్యాన్ని చాటటానికి సంకేతమే కథలని. అలాంటి సత్యాన్నే చాటుతున్నదిది. ఏమిటా సత్యం. భారతంలో సంజయుడి రాయబారమని ఒకటున్నది. అది కౌరవుల దగ్గరి నుంచి పాండవుల దగ్గరకు నడచిన రాయబారం ధృతరాష్ట్రుడు తమ్ముని కొడుకులకు రాజ్య భాగమివ్వదలచుకోలేదు. దుర్యోధనుని కంటే దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. అతడు పలువ అయితే ఇతడు సాధు పలువ. తీయని మాటలు చెప్పి ప్రాణాలు తీసే యత్నమది. దానికి తగినవాడినే ఎన్నుకొన్నాడు రాయబారిగా. వాడే సంజయుడా ముసలాయనకు నమ్మిన బంటు. ప్రజ్ఞాచక్షుని మించిన అఖండ ప్రజ్ఞాశాలి. నెత్తురు కూడు తినేదానికన్నా అయిదుగురూ కలిసి బిచ్చమెత్తుకొని బ్రతకటమే మీ నడవడికి తగిన పనిఅని నిండు సభలో ధర్మజునికి సలహా ఇచ్చేటంత సాహసి అతడు
Page 285