మునిగి చూచేసరికందులో అజస్ర సహస్రఫణా మండల మండితుడైన ఆదిశేషుడూ, ఆశేషతల్పం మీద అనల్ప ప్రభాభాసురమైన పీతాంబరం ధరించి శిరస్సున కిరీటమూ, ఉరస్సున మహాలక్ష్మి కరార విందములలో శంఖచక్రాది దివ్యాయుధాలూ, పదార విందములలో దివ్యమణి నూపురాలూ దాల్చిన శ్రీమహావిష్ణువు దివ్యమంగళ రూపం సాక్షాత్కరిస్తుంది. అది చూచి తన జన్మ ధన్యమయిందని చెప్పిఆ పురాణ పురుషుని వేనోళ్ల పొగడుతా డక్రూరుడు. కలలం బోలెడి పుత్ర మిత్ర వనితా గారాదులన్నీ ఎండమావుల లాంటివి. అయినా వాటినే యధార్థమని నమ్మి ఇంత కాలమూ పరమార్థానికి దూరదూరంగానే ఉండిపోయాను. ఇది తత్త్వజ్ఞానమెలా అవుతుంది. కనుక తత్త్వమేదో దాన్ని తెలుసుకొనేందుకు నాకు నీ పాదయుగం చూపమని ప్రార్థిస్తాడు. పాదయుగమేదో గాదు. అది ఈ నామరూపాలే. వీటి ద్వారానే వీటి వెనకాల దాగి ఉన్న ఆ పరతత్త్వాన్ని అర్థం చేసుకోవాలి సాధకుడు. అది ఆ భగవదను గ్రహంవల్లనే సిద్ధాంచాలి. ఇదే భక్తుడి కాంక్ష.
అది కనిపెట్టిన పరమాత్మ వెంటనే తన రూపం మాపుచేసి ఎప్పటిలాగా రథంలో ఉన్నట్టు దర్శనమిస్తాడు. అక్రూరుడది చూచి రథాన్ని సమీపించగానే ఏమి టక్రూరా ! ఎంత సేపయింది నీవు నదిలోకి వెళ్లి, ఇంత తడవక్కడ ఏమి చేస్తున్నా వెక్కడా లేని చోద్యమేదైనా నీ కక్కడ కనిపించిందా అని ఏమీ తెలియనట్టు ప్రశ్నిస్తాడు. అప్పుడా మహాభక్తుడదంతా భగవన్మాయే నని అర్థం చేసుకొని మహాత్మా !
నీలోన లేని చోద్యము - లే లోకము నందు జెప్పనీశ్వర నీటన్ నేలన్ - నింగిని నున్నవె
ఉన్న చోద్యాలన్నీ నీలోనే ఉన్నాయి పొమ్మంటాడు. భగవంతుని మర్మం భాగవతుడికే ఎఱుక - మరి ఎవరికీ గాదనేందుకీదే నిదర్శనం. తరువాత మధురా ప్రవేశమూ-కంస వధా జరుగుతాయి. అన్న కన్నులార చూచి అక్రూరుడు భగవదంకిత సర్వజీవునుడయి తన గృహంలోనే కాలక్షేపం చేస్తుంటాడు.
ఆ తరువాత కొంత కాలానికి మరలా అక్రూరుడి దగ్గరకు స్వయంగా వస్తాడు కృష్ణుడు. భక్తుడెక్కడ ఉన్నా ఉండవచ్చు. భక్తి భావమనేది నిశ్చలంగా ఉండాలే గాని భగవంతుడలాంటి భాగవతుడి కెప్పుడూ దూరం కాడు. వెతుక్కొంటూ వస్తాడక్కడికి.
Page 284