అలాంటి వారంటే ఎవరికి వారు తమ మనిషిగానే భావిస్తుంటారు. ఇది లోక సహజం. అయితే సజ్జనులు వారిని సత్కార్యాలకు నియోగిస్తే దుర్జనులు దుష్కార్యాలకు వాడుకొంటారు. ఇదీ లోకసహజమే. ఇది వారి సాధుత్వానికొక కఠిన పరీక్ష కూడా.
ఇలాంటి పరీక్షే ప్రస్తుతమీ అక్రూరునికి కూడా ఎదురయింది. నారాయణుడే దేవతల కార్యార్థమై యదువంశంలో పుట్టి నందుని ఇంట పెరుగుతున్నాడని విన్నాను. అన్న బలరాముడు కూడా అతనితోనే ఉన్నాడు. వారినిక్కడికి తీసుకురా - నేను వారి ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు కంసుడు. దానికా పరమ భాగవతుడిచ్చిన సమాధానమిది.
పంపిన బోని వాడనె - నృపాలక - మానవులెన్న దమ్మునూ హింపరు - దైవయోగముల నించుక గానరు - తోచినట్లు ని ష్కంపగతిం జరింతు రది కాదన వచ్చునె - ఈశ్వరేచ్ఛ ద ప్పింపగ రాదునీ పగతు బిడ్డల దెచ్చద బోయి వచ్చెదన్
చూడండి. ఇందులో ఎంత గంభీరమైన భావమిమిడి ఉన్నదో. భగవత్సంకల్పమే సర్వమూ, మంచి అయినా చెడ్డ అయినా అంతా ఆయన ప్రణాళికే. అందుకే నీకీ దుర్బుద్ధి పుట్టింది. బహుశా ఇది ఒక నెపంగా నీకు ధనుర్యాగంలోనే ఆయువు మూడి ఉంటుందాయన చేతిలో. అది ఈశ్వరేచ్చే అయినప్పుడలాగే కానీ, దానిని తప్పించటానికి మనమెవరం. ఆ ఈశ్వర సంకల్పానికి నేనూ ఒక సహకారినైతే అంతకన్నా కావలసిందేముంది. తప్పక అలాగే నడచుకొంటాను.
భక్తుడెప్పుడూ స్వతంత్రుడు కాడు. సర్వావస్థలలోనూ భగవదిచ్ఛానువర్తి అయి బ్రతుకు సాగిస్తుంటాడు. అది మంచి ఇది చెడ్డ అని చూడడు. చెడ్డ అయినా భగవదిచ్ఛ అయితే అది మంచే అతని పాలిటికి. కనుక ఏది ఎప్పుడెలా జరుగుతున్నా ఎదురాడరాదు. “న ద్వేష్టి సంప్రవృత్తాని” అన్నట్టు దాని ననుసరిస్తూ పోవటమే భగవత్కైంకర్యంగా భావిస్తాడు. ఇలాంటి సేవా బుద్ధితోనే బయలుదేరాడు అక్రూరుడు. నందగోకులం చేరాడు. చేరాడో లేదో ఇక కృష్ణ సందర్శనం తన కవశ్యంగా లభిస్తుంది గదా అని ఎంతో మురిసిపోతాడు. అంతేకాదు.
Page 281