గోపికలు. తనివి దీఱ ఆయనతో రాసక్రీడాదులనుభవించారు. రస సంబంధియే రాసం. రసో వైసః రసం పరమాత్మ స్వరూపమే. తత్సాహ చార్యాన్ని అనుభవించటమే రాసక్రీడ. తన్మూలంగా కలిగే నిర్వృతి ఏదుందో అదే జలక్రీడ. జలమంటే ఉపశమనం. మౌనం. భగవత్సాహచర్యానుభూతి చివరకు మౌనంతోనే పర్యవసిస్తుందని చెప్పటమే రాసక్రీడానంతర జలక్రీడా వర్ణనం.
ఇలాంటి నిర్వాణ భూమికనందుకొన్న తరువాత ఇక న్యాయమైతే వారక్కడి నుంచి తిరిగి రాకూడదు. అంటే తగ్గుస్థాయిలో కలిగే ఆలోచనలు మనసులో ప్రవేశించరాదు. అయినా ప్రవేశించాయా గోపికలకు. కారణం వారింకా సగుణ భూమికలో నుండటమే. నిర్గుణంలాగా భాసించే సగుణ భక్తి ఇది. జ్ఞానులలాగా అప్పుడప్పుడుపన్యసించినా తదాభాసేగాని తత్త్వం కాదది. దీనిని బయట పెట్టటానికే ఆక్రూరాగమనం. కంసుని ఆదేశాన్ని శిరసావహించి రామకృష్ణులను తోడ్కొని పోవటానికి వచ్చాడక్రూరుడు. అది మహాక్రూరమైన చర్యగా కనిపించింది వారికి. కృష్ణుడు తమకు మరలా దూరమవుతున్నాడే అని వారి బాధ. దూరం కావాలనుకొన్న వాడసలుకృష్ణుడే. తానే దూరం కావాలనుకొని దానికి కంసుణ్ణి అక్రూరుణ్ని ఒక నిమిత్తం చేసుకొన్నాడా పరమాత్మ. అది అల్పమేధసలైన ఆ గోపికల కంతే పట్టలేదు. పైగా అక్రూరుడే కావాలని తీసుకెళ్లుతున్నాడని ఆయన నెక్కడలేని శాపనార్థాలు పెడతారు. "అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనో వల్ల భుం జక్రిన్మాకడఁ బాపి కొంచునరుగన్ చర్చించి యేతెంచినా డక్రూరుండట క్రూరుడీత” డని తిట్టిపోస్తారు. “హరినేలాకొని పోయె దంచు మన మాయక్రూరు బ్రార్థింతమా” అని మరలా సామానికి దిగుతారు. అది కూడా పనిచేయక పోయేసరికి “మము గృపం బాటింపు గోవింద మాధవ దామోదర యంచు” సుజాతంచైన గీతంబులతో విలపిస్తారు. దానికీ లెక్కచేయక వారు వెళ్లిపోతుంటే “అదె చనుచున్నవాడు ప్రియుడల్లదె తేరదె వైజయంతి” అని ఒకరి కొకరు వేలు పెట్టి చూపుతూ కండ్ల కబ్బినంత దూరం చూస్తూ నిలబడి పోతారు.
ఏమిటిదంతా. సగుణచింతనలో ఉన్న దౌల్బల్యమే ఇది. కనిపిస్తే ఆహ్లాదం. కనపడకుంటే విషాదం. ఎప్పుడూ ఏకరూపంగా ఉండే స్థితి కాదది. అలాంటి స్థితే కావాలంటే అది నిర్గుణంలోనే. సగుణంలో దొరకదా నిధానం. కనుకనే పెన్నిధి
Page 277