సగుణోపాసకుల వ్యవహారమే ఇంత. అందులోనూ ఉపాసకులు స్త్రీలయినప్పుడిక చెప్పనే అక్కరలేదు. చేతనా చేతన వివేచన ఉండదు వారికి. తన్మయత్వ మెక్కువయ్యే కొద్దీ చరాచర ప్రకృతి అంతా తమ ఉపాస్య దేవతా మయంగానే భాసిస్తుంది వారికి. ప్రకృతిలో ఏది చూచినా అది తమ దైవానికి ప్రతికృతే. ఆయన మూర్తిని పట్టి ఇచ్చే ప్రతీకమే. లేకుంటే.
కొమ్మకు పువ్వులు గోసినాడిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు సతినెత్తుకొని వేడ్క జరిగినాడక్కడ - తృణములో లేదిదె తెఱవజాడ ఒకయెలనాగచే యూదినాడిక్కడ సరసనున్న వినాల్గు చరణములును ఒక నీలవేణితో నొదిగినా డిక్కడ - మగజాడలో నిదెమగువ జాడ
అంటూ ఇలా ఎక్కడ బడితే అక్కడ భగవత్పాద ముద్రలు దర్శనమీయవు వారికి. భక్తుడికీ ప్రపంచమంతా భగవద్విభూతే. తత్స్వరూప ముద్రా ముద్రితమే. ఇందులో ఏ ముద్ర చూచినా అది ఆ రూపాన్ని పట్టి ఇచ్చే గట్టి లాంఛనమే. అయితే అలా చూచే దృష్టి ఉండాలి సాధకుడికి. ఉన్ననాడికి సృష్టి అంతా స్రష్ట రూపమే మరేదీ గాదు. అలాంటి అంతర్దృష్టితోనే దర్శించగలిగారా గోపికలు.
అలా దర్శించటంలో వారి కప్పుడప్పుడాయన కేవలమూ తమ్మువలచి వలపించే వల్లభుడే కాదు. సకల జగదంతర్యామి అయిన ఆ పరమాత్మేననే భావన కూడా ఉదయించేది. “నీవు యశోద బిడ్డడవె - నీరజ నేత్ర సమస్త జంతుచేతో విదితాత్మ వీశుడవు - తొల్లి విరించి దలంచి లోకరక్షా విధమాచరింపుమని సన్నుతి సేయ సత్కులంబునన్ భూ వలయంబు గాన నిట పుట్టితి గాదె మనోహరా కృతిన్” ఒక ఆకృతి అంటూ లేని పరతత్త్వమింత మనోజ్ఞమైన ఆకృతి ధరించి ఆవిర్భవించిందంటే అది భూభారావతారణార్ధమే నని ఎంతో ఆర్షదృష్టి తమకున్నట్టు కనిపిస్తారు. కాని అంతలోనే "నీ నగవులు నీ చూడ్కులు నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మాలాపంబులు మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా- నీ యధ రామృత సంసేవన విధి నంగజు తాపమెల్ల విడిపింపగదే” అని సగుణ భావనలో తలమునకలుగా మునిగిపోతారు. ఆ నల్లని ముగ్ధమోహన రూపంతోనే కనిపించి తమ వియోగవహ్ని చల్లార్చమని బ్రతిమాలుతారు.
Page 275