#


Index

సగుణ భక్తులు - కుంతీ ప్రభృతులు భాగవతము

పరిపూర్ణత లేదు గనుకనే మనబోటి మానవులకే ఈ ధర్మా ధర్మాది విచికిత్స అని కూడా జవాబిస్తాడు. ఒకవేళ మానవుడు కూడా ఆ స్థాయి కెదగగలిగితే మరీ మంచిదే. వాడికి లేదలాటి ద్వంద్వ ప్రసక్తి అని కూడా అర్ధం చేసుకోవాలి మనం. కనుకనే తమ ప్రవర్తన గూర్చి కృష్ణుడాక్షేపించినప్పుడు అన్ని ధర్మములూ తెలిసిన నీవేనా ఇలా మాటాడవలసిందని మరలా ఆయనను మందలిస్తారు గోపికలు. ఇంత ధైర్యంగా అనగలిగారంటే అది అనన్యమైన వారి మధుర భక్తికి నిదర్శనం.

  ఇలాటి భక్త్యావేశంతో ఆ గోపిక లెక్కడ బడితే అక్కడే ఆ పరమాత్మను చూడగలుగుతారు. ఆయన వియోగం క్షణకాలం కూడా సహించలేరు. సర్వత్రా తన మూర్తిని దర్శించవలసిన వారలా తపన చెందటమిష్టం లేదు పరమాత్మకు. అందుకోసమున్నట్టుండి ఆయన వారి మధ్యలో నుంచి మాయమయి పోయేవాడు. అది వారి అనన్యమైన భక్తికొక పరీక్ష ఆయన దృష్టిలో. కాని వారి దృష్టిలో ప్రగాఢమైన విరహం. దానితో తపించిపోయివారు “పున్నాగ కానవేపున్నాగ వందితు – తిలకంబ కానవే తిలక నిటలు” అని తమ ప్రాణనాథుణ్ణి అక్కడా ఇక్కడా వెదకుతూ పోతారు. "నల్లని వాడు పద్మనయనంబుల వాడు" అంటూ ఆయన చిరునామా చెప్పి ఇలాటి వాడొకడు మా మానధనాన్ని దోచుకొని పోయాడు. మీ పొదల మాటున లేడు గదా చెప్పండని కనపడ్డ మల్లెల తీవలనన్నింటినీ అడుగుతూ పోతారు. ఇంకా మిరహోన్మాద మెక్కువయి “అదె నంద నందను డంతర్హి” తుండయ్యె పాటలీ తరులార పట్టరమ్మ ”హేలావతుల కృష్ణయేల పాసితివని యై లేయ లతలార యడుగురమ్మ” అని నోరులేని చెట్టులనూ గుట్టలనూ ప్రాధేయపడేవారు. అంతేగాదు.

కిటియై కౌగిట జేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచె వడి కృష్ణుండై యిట పద చిహ్నములిడె - క్రిం దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ

  అని భూదేవి సౌభాగ్యానికి మురిసిపోతారు. ఇంకా వెఱి తల కెక్కితే   పూతనయై యొక్క పొలతిచరింపంగశౌరియై యొకకాంత చన్నుగుడుచు బాలుడై యొక భామపాలకునేడ్చుచో బండినేనని లేమ పాఱదన్ను ఇలా కృష్ణుని బాల్యచేష్టలు మీద ఆపాదించుకొని తృప్తి పడతారు.

Page 274

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు