భజిస్తుంది. లోకంలో చూచే ఈ వ్యవహారంలో ఎంత మాధుర్యముందో అదే సరిగా గోపికలకూ గోపికావల్లభుడికి మధ్య ఉన్నవ్యవహారంలో కూడా. అయితే ఇది మాధుర్యమే గాని భక్తి కాదు. అది మధురమూ భక్తీ కూడా. కారణం. ఇది కేవలం లౌకికం. అది లోకోత్తరం. ఇక్కడ కేవలం స్త్రీ పురుషులమే మనమని శరీరధర్మాలే చూస్తున్నారు. అక్కడ ఈ స్త్రీ నేనొక పరమపురుషుణ్ణి భజించే భక్తురాలననీ, ఆయనకే ఈ తనుధన మనః ప్రాణాలన్నీ సమర్పితమనే పరిపూర్ణ భక్తి భావంతో ప్రవర్తిస్తుంది. ఆ పురుషుడు కూడా అశరీరుడూ నిత్యముక్తుడూ అయిన పరమ పురుషుడు కాబట్టి ప్రత్యేకంగా నేనొక స్త్రీ శరీరంతో భోగిస్తున్నాను. దీని మూలంగా నాకెనలేని నిర్వృతి కలుగుతున్నదనే సవిషయ భావంతో ఉండడు.
ఇలాంటి అంతర్యమిందులో ఇమిడి ఉంది గనుకనే ఇది మధుర భక్తి. ఇది లౌకికం కాదు. లోకోత్తరమని చెప్పాము. లోకోత్తరం గనుకనే మనకది అర్థం కాదు. అర్థం కాకపోతే దాని మాధుర్యమెలాంటిదో చవి చూడలేము. కాబట్టి మనకోసమని పురాణ కర్త దాన్ని లౌకికమైన స్థాయిలో వర్ణించవలసి వచ్చింది. అలౌకికానికి లౌకికమనేది ప్రతిబింబమే గదా. అది బింబమైతే ఇది దానికి ప్రతిబింబం. ప్రతిబింబం వట్టిదే. మిథ్యాభూతమే. మిధ్యాభూతమైనా ఇది ఆతథ్యమైన బింబాన్ని మనకు పట్టి ఇస్తుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూంటే దాని నీడ మనకు నేలమీద కనిపిస్తుంది.ఇదే ఆ పక్షి కాదు. కాని ఇది కనిపించగానే పైకి చూస్తాము మనం. ఎందుకు. ఈ నీడ ఎక్కడిదా అని. చూస్తే తప్పకుండా పైన ఎగిరే పక్షి కంటబడుతుంది. అప్పటికీ ఆ ప్రతిబింబమే గదా ఆ బింబాన్ని చూపింది మనకు. అలాగే లౌకికమైన ఈ గోపికా కృష్ణుల శృంగారమంతా లోకోత్తరమైన శృంగారానికి ఒక ఛాయ. అయితే ఏమిటా లోకోత్తరం అని అడగవచ్చు. అదే జీవేశ్వరుల పరస్పర సంబంధం. గోపికలంటే ఎవరో కాదు. జీవులే. గోపికా వల్లభుడైన కృష్ణుడా ఈశ్వరుడే. సహజంగా జీవుడు పరిపూర్ణుడు కాడు. కనుక పురుషుడు కాడతడు. స్త్రీ. ఈ స్త్రీ పరిపూర్ణత నందు కోవాలంటే పూర్ణ పురుషుణ్ణి భజించాలి. ఆ స్వరూపంతో ఏకత్వం భజించాలి. "సతా సోమ్య తదా సంపన్నో భవతి" అంటున్న దుపనిషత్తు. అంతేకాదు. “యథాస్త్రియా సంపరిష్వక్తో న బహిర్వేద నాంతర”మ్మని లోకంలో స్త్రీ పురుష వ్యవహారాన్నే జీవేశ్వరైక్యాని కుపమానంగా వర్ణిస్తుంది.
Page 272